
కుమార్తెను ఇంటికి పంపమన్నందుకు మామపై అల్లుడు దాడి
రాయచోటి టౌన్ : తన కుమార్తెను రంజాన్ పండగకు పుట్టింటికి పంపమన్నందుకు మామపై అల్లుడు దాడి చేసిన సంఘటన రాయచోటిలో శనివారం చోటుచేసుకొంది. బాధితుల కథనం మేరకు.. రాయచోటి పట్టణంలోని పాత రాయచోటికి చెందిన అజ్మత్ తన కుమార్తె తంజీమ్‌ను అదే ప్రాంతానికి చెందిన మహబూబ్‌బాషా కుమారుడు జుబేర్‌కు ఇచ్చి ఏడాది కిందట వివాహం చేశారు. పెళ్లిరోజున ఇచ్చిన బంగారు ఆభరణాలు అమ్మే శాడని ఇటీవల భార్య, భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంతలో రంజాన్ పండగ రావడంతో అల్లుడు, కుమార్తె, బంధువులను పండగకు పిలిచేందుకు తన కుమార్తె ఇంటికి అజ్మత్ వెళ్లారు. వారు పంపేందుకు నిరాకరించడమేగాక అజ్మత్‌తో ఘర్షణ పడ్డారు. వాగ్వాదం పెరిగి అల్లుడి బంధువులు అజ్మత్‌పై దాడి చేసి గాయపరిచారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు.
రైతు ఆత్మహత్య
పుల్లంపేట : వ్యవసాయంలో నష్టాలు వచ్చి అప్పుల పాలైన రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. తిప్పాయిపల్లి హరిజనవాడకు చెందిన దార్ల రఘురామయ్య (52)కు ప్రభుత్వం ఐదు ఎకరాలు భూమిని మంజూరు చేసింది. అరటి తోటన సాగు చేసి జీవనం కొనసాగిస్తున్నాడు. వాతావరణం అనుకూలించగా, ఆశించిన దిగుబడి రాకపోవడంతో అప్పులు పెరుగుతూ వచ్చాయి. దీంతో రూ.7లక్షలు అప్పుచేసి తీర్చలేక మనస్థాపం చెందారు. ఆదివారం విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలోకి చేరి సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి ముగ్గరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు పట్టాలపై మృతదేహం
రాజంపేట : నందలూరు–రేణిగుంట రైలు మార్గంలో హస్తవరం రైల్వే స్టేషన్ వద్ద సోమవారం 25 ఏళ్ల వయస్సు కలిగిన యువకుడి మృతదేహం స్థానికులు గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు తెలియాల్సి ఉంది.
వృద్ధులకు గాయాలు
ఓబులవారిపల్లె : మద్యం తాగి ఆకతాయిలు రాళ్లు విసరడంతో తేనెటీగలు లేచి ఆశ్రమంలో వృద్ధులపై దాడి చేశాయి. మండలంలోని పాపిరెడ్డిపల్లి గ్రామంలో జీవన జ్యోతి ఆనంద నిలయంలో ఆశ్రయం పొందుతున్న ఏడుగురు వృద్ధులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆశ్రమం ప్రక్కనే చెట్టుపై తేనెపట్టు ఉండడం.. ఆకతాయిలు మద్యం తాగి రాళ్లతో కొట్టడంతో అవి వృద్ధులపై దాడి చేయడంతో దిక్కుతోచక వారంతా ఆందోళనకు గురయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.