
ఆస్పత్రిలో రోగుల భోజన నాణ్యతపై తనిఖీ
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ వైద్యశాల(రిమ్స్)లోని రోగులకు అందిస్తున్న భోజన నాణ్యతను ఫుడ్ సేఫ్టీ అధికారులు యండి.షంషీర్ ఖాన్, డాక్టర్ ఎం.హరిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న భోజనం , పోషక విలువలు సంవృద్ధిగా ఉన్నాయా? లేదా అన్నది స్వయంగా పరీక్షించారు. రోగులతో మాట్లాడి అందుతున్న భోజనం గురించి వారి అభిప్రాయాలు తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిషన్ ఆఫ్ ది ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు,ప్రైవేట్ ఆసుపత్రుల్లో డైట్ కాంట్రాక్టర్లు అందిస్తున్న భోజనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భోజనం నాణ్యతలో ఎక్కడైనా లోపం కనబడితే తక్షణమే వాటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించి పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తదుపరి పైన తెలిపిన ఆసుపత్రి ముడి పదార్థాల నాణ్యత కోసం ల్యాబొరేటరీకి పంపించారు. ఈక్రమంలో డైట్ కాంట్రాక్టర్లకు తగిన సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైటిషన్ బాలాజీ నాయక్, డైట్ కాంట్రాక్టర్ ఖాజా పాల్గొన్నారు.