
జజ్జనకర జనారే.. జాతర భళారే..!
రాజంపేట టౌన్ : పట్టణంలోని బలిజపల్లెలో గురువారం గంగమ్మ జాతర సంబరం అంబరమంటింది. వేడుక బుధవారం రాత్రి నుంచే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తొలుత నిర్వహణలో భాగస్వాములైన నాపరపురెడ్డిపల్లె నిర్వాహకులు, ప్రజలు.. గంగమ్మ సోదరుడైన పోతురాజును ఊరేగిస్తూ అమ్మవారికి నవధాన్యాలు తీసుకొచ్చారు. అనంతరం గంగమ్మకు పుట్టినిల్లయిన తుమ్మల అగ్రహారం నుంచి.. ఆ గ్రామ మహిళలు పెద్దఎత్తున గండదీయలను బలిజపల్లెకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన నిర్వాహకులు, యువకులు తప్పెట్ల దరువుకు అనుగుణంగా అడుగులు వేస్తూ.. కర్రసాము విన్యాసాలు చేస్తూ, దీపావళిని తలపించేలా బాణాసంచా పేల్చుతూ చేరుకున్నారు. బలిజపల్లెలో గంగమ్మ ప్రతిమ తయారైన అనంతరం.. నిర్వాహకులు గురువారం తెల్లవారుజామున రథంలో అమ్మవారిని ఊరేగిస్తూ ప్రత్యేకంగా తయారు చేసిన వేపమండల గుడిలోకి తీసుకొచ్చి కొలువు దీర్చారు. గంగమ్మ ఊరేగింపుగా గుడిలోకి వచ్చే సమయంలో పోతురాజును ఎగిరించేందుకు భక్తులు పోటీపడ్డారు. గంగమ్మ గుడిలోకి వస్తుండగా.. వందలాది మంది భక్తులు ముద్దలు పెట్టి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు.
గంగమ్మా.. కాపాడమ్మా
ఈ సందర్భంగా భక్తులు ‘అమ్మా గంగమ్మ తల్లి.. మము కరుణించి కాపాడమ్మా’ అంటూ వేడుకున్నారు. గంగమ్మ గుడిలోకి చేరుకోక ముందే వేలాది మంది బలిజపల్లెకు చేరుకోవడంతో.. బలిజపల్లె గ్రామం ఇసుకవేసినా రాలనంతగా భక్తులతో నిండిపోయింది. అమ్మవారు గుడిలో కొలువు దీరాక భక్తులు ఒక్కసారిగా గంగమ్మను దర్శించుకునేందుకు త్వరపడటంతో పోలీసులు అధికారులు, సిబ్బంది అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గంగమ్మ గుడిలో కొలువుదీరగానే జాతర ఒక్కసారిగా ఊపందుకుంది. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు కిలోమీటరు మేర భక్తుల రద్దీ కొనసాగింది.
దారులన్నీ జాతర వైపే
బలిజపల్లె గంగమ్మ జాతరలో అమ్మవారికి వరపడితే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందువల్ల బుధవారం రాత్రి నుంచే గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు బలిజపల్లెకు చేరుకోవడం ప్రారంభించారు. జాతరలోకి వచ్చేందుకు నాలుగువైపులాఉన్న రహదారుల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. దీంతో పట్టణంలోని అన్ని దారులు జాతరవైపు సాగి కోలాహలంగా మారాయి.
వైభవంగా బలిజపల్లె గంగమ్మ జాతర
ఆకట్టుకున్న యువకుల విన్యాసాలు
భారీగా తరలివచ్చిన భక్తులు
గంగమ్మను దర్శించుకున్న ఆకేపాటి, పోలా
జాతర సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాఽథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డి.. గంగమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. బలిజపల్లె గంగమ్మ ఎంతో విశిష్టత సంతరించుకున్న దేవత అని, గంగమ్మ బలిజపల్లె గ్రామంలో స్వయంభుగా వెలియడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. బలిజపల్లె గంగమ్మ వల్ల జిల్లాలోనే కాక రాష్ట్రంలోనూ రాజంపేటకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని తెలిపారు. గంగమ్మ కరుణతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిపించి ప్రజల, రైతుల కష్టాలు తీర్చాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో ప్రసిద్ధి గాంచిన గంగమ్మ జాతరలో తాను ప్రతి ఏడాది పాల్గొని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, అమ్మవారిని వేడుకునే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని తెలిపారు.

జజ్జనకర జనారే.. జాతర భళారే..!

జజ్జనకర జనారే.. జాతర భళారే..!