కడప సెవెన్‌రోడ్స్: జాతీయ రహదారుల విస్తరణ, సోలార్ పార్కుల ఏర్పాటు కోసం చేపట్టిన భూ సేకరణ, అటవీ, పర్యావరణ అభ్యంతరాలు, లీగల్ క్లియరెన్స్ ప్రక్రియలను పెండింగ్ లేకుండా...త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల విస్తరణ కోసం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ పై శుక్రవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జేసీ అదితి సింగ్, డీఎఫ్‌ఓ వినీత్ కుమార్‌లతో కలిసి సంబంధిత తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ దేశంలో రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయన్నారు. అందు లో భాగంగా బెంగుళూరు–కడప–విజయవాడ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ చేస్తోందన్నారు. భూములు కోల్పోయినవారికి పరిహారం కూడా ఇస్తోందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న మూడు రకాలైన సోలార్ అనుబంధ పవ ర్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను, ఇతర అనుమతులను క్లియర్ చేయాలన్నారు. జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓలు సాయిశ్రీ, చిన్న య్య, ఎన్ హెచ్‌ఏఐ ఎస్డీసి వెంకటపతి, పీడి అశోక్ కుమార్, డిప్యూటీ మేనేజర్లు వేణుగోపాల్, సుదర్శన్ కుమార్, ఆర్‌అండ్‌బీ నేషనల్ హైవే ఈఈ విజయ్ భాస్కర్ రెడ్డి, నెడ్ క్యాప్ జిల్లా అభివృద్ధి అధికారి యల్లారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
లక్ష్యాలను అధిగమించాలి
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా.. అన్ని ప్రాధాన్యతా రంగాలను మరింత పటిష్టం చేసి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో అన్ని రకాల ప్రాధాన్యతా రంగాలకు చెందిన జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా రంగాల్లో జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలు, సాధించాల్సిన ప్రగతి.. తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. విత్తనాల ఉత్పత్తి, పంటల మార్పులు, మైక్రో న్యూట్రియన్స్ల పై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో చిరుధాన్యాల పంటల సాగుబడిని పెంపొందించాలని.. ఆ దిశగా రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టం పై రిపోర్ట్ అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ శాఖ జేడీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి