
ఉప సర్పంచ్ ఎన్నికలో ఓటమి తప్పదనే టీడీపీ అరాచకాలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించి టీడీపీ అరాచకాలు సృష్టించిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు ఆయన సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ ఎస్పీకి వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికకు సంబంధించి 20 మంది వార్డు మెంబర్లు ఉండగా 19 మంది వైఎస్సార్‌సీపీ, కేవలం ఒక్క వార్డు సభ్యుడు మాత్రమే టీడీపీ మద్దతు దారుడు ఉన్నాడన్నారు. ఒక్క సభ్యుడిని పెట్టుకుని వైస్ సర్పంచ్ పదవి కావాలని కోరడం దారుణమన్నారు. దేశంలోగానీ, రాష్ట్రంలోగానీ, ప్రపంచంలోగానీ జరిగే అవకాశం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నిక సందర్భంగా ఏకంగా పోలీసుల మద్దతుతోనే టీడీపీ నేతలు అరాచకాలు సృష్టించారన్నారు.తమను లోనికి రానీయకుండా టీడీపీ చోటామోటా నేతలు దుర్మార్గమైన నీచమైన సంస్కృతికి తెర తీశారన్నారు. నకిలీ మనుషులను ఏర్పాటు చేసి, నకిలీ ఐడీ కార్డులు తయారు చేసి వారిని పంచాయతీ వార్డు సభ్యులుగా తీసుకు వస్తే పోలీసులు వారిని లోనికి పంపించారన్నారు. ఈ నేపథ్యంలో లోపలున్న అధికారులు ఒప్పుకోకపోతే ఆయా అధికారులను బండబూతులు తిట్టారన్నారు. తమ వారిపై పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తే తిరిగి తమ వారినే పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్బంధించారన్నారు. తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోగా తమకు చెందిన 100 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సోదరుడు భార్గవరెడ్డి ఎన్నిక జరిగే పంచాయతీ కార్యాలయంలో కూర్చుని తన మనుషులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బెదిరించే ప్రయత్నాలు చేశారన్నారు. టీడీపీ వారికి ఓటమి తథ్యమనుకున్న తరుణంలో వారు ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి చేత గుండెపోటు డ్రామా ఆడించారన్నారు. ప్రొద్దుటూరులో తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడంతో కడపలో జరిగే గ్రీవెన్‌సెల్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు రాఘవేంద్రారెడ్డి, వెంకటేశ్వరరెడ్డిలపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని, నకిలీ ఐడీ కార్డులు సృష్టించిన, ఆయా ఐడీ కార్డులను అడ్డం పెట్టుకుని ఎన్నికల హాలులోకి వచ్చిన వారిపై, ఎన్నిక సందర్భంగా అధికారులను బెదిరించిన వారిపై, వీధి రౌడీలను ఎన్నికల్లో పాల్గొనేందుకు అనుమతించిన పోలీసు అధికారులపై చర్యలు చేపట్టి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వివిధ కారణాలతో ఎస్పీ తమకు న్యాయం చేయకపోతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని, ఆపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ప్రొద్దుటూరును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు బలిదానం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మిదేవి, గోపవరం సర్పంచ్ మోషె, ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్ వరికూటి ఓబుల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార
ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి