
పెరిగిన ధరలతో సామాన్యుల బతుకు దుర్భరం
కడప కార్పొరేషన్ : కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల బతుకు దుర్భరం చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంగానీ, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంగానీ పేదలకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కరెంటు చార్జీలు విపరీతంగా పెంచారని, భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెంచారన్నారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్‌పై రూ.50లు, పెట్రోల్, డీజిల్ ధరలను కూడా పెంచడం దారుణమన్నారు. ఉజ్వల పథకంలో ఉన్న పేదలకు కూడా పెంచిన ధర వర్తింపజేయడం వల్ల పేదలు మళ్లీ కట్టెల పొయ్యికి పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం నిత్యావసర ధరలపై పడనుందన్నారు. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, సామాన్యులు ఏం కొనలేని, తినలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇలాగే గ్యాస్ ధర పెంచితే దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఆ భారాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాయడం మినహా చేసిందేమీ లేదన్నారు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...సంపద సృష్టించకపోగా ఇప్పటికే రూ.1.64లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. వారం వారం అప్పులు చేస్తున్నా ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. జన్మభూమి పథకానికి పేరు మార్చి పీ–4 అనే కొత్త స్కీం తెచ్చారన్నారు. దాతల సహకారంతో గ్రామాల్లో రోడ్లు, కాలువలు నిర్మించాలన్నది దీని ఉద్దేశమన్నారు. టీడీపీ నాయకులకు మేలు చేయాలన్న ఆలోచనతో తీసుకొచ్చిన ఈ స్కీంకు దాతల సహకారం ఉండదన్నారు. సూపర్ సిక్స్ పథకాలని చెప్పి ఒక్కటీ అమలు చేయలేదన్నారు. వీరు ప్రజలకు చెప్పేదొకటి, చేసేది మరొకటని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చాలని, అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పులి సునీల్, బీహెచ్ ఇలియాస్, జి. శ్రీనివాసులరెడ్డి, త్యాగరాజు, శ్రీరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇప్పటికే పెరిగిన కరెంటు,
రిజిస్ట్రేషన్ చార్జీలు
పెట్రో ధరల పెరుగుదల
నిత్యావసర ధరలపై ప్రభావం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్‌రెడ్డి