
కప్పం కట్టాల్సిందే!
సాక్షి ప్రతినిధి, కడప: కూటమి ప్రభుత్వంలో రోజుకో దౌర్జన్యం వెలుగు చూస్తోంది. హామీల అమలు మాటేమోగానీ సొంత పైత్యాన్ని ప్రజలపై రుద్దుతోంది. ముఖ్యంగా కడప నగరంలో స్వాహా పర్వం ఎక్కువైంది. తాజాగా ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు లక్ష చొప్పున చెల్లించాలని అల్టిమేటం జారీ అయ్యింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ఎమ్మెల్యే మాధవీరెడ్డి అభ్యర్థన మేరకు కప్పం కట్టాల్సిందిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రైవేటు ఆస్పత్రుల యాజమానులను ఆదేశించడం గమనార్హం.
● కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి శుష్క వాగ్ధానాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైన మేనిఫెస్టో అంటూ హామీలిచ్చిన ఆమె, ఆ తర్వాత మాట మారుస్తున్నారు. నగరం మధ్యలోంచి వెళ్లే బుగ్గవంకపై డాక్టర్ వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాలు ఆరు వంతెనలను నిర్మించాయి. మరో రెండు లోలెవెల్ వంతెనలను వైఎస్ జగన్ ప్రభుత్వం మంజూరు చేసింది. ఎన్నిక కోడ్ రావడంతో ఆ పనులు పెండింగ్ పడ్డాయి. గుర్రాలగడ్డ టు షామీరియా బ్రిడ్జి లోవెల్ కాజ్‌వే, రవీంద్రనగర్ టు నాగరాజుపేట లోవెల్ కాజ్‌వే పనులు పూర్తి చేయించే బాధ్యత తనదేనని, ఎన్నికలయిన 15 రోజుల్లో పనులు ప్రారంభించి ఆరునెలల్లో షామీరియా మసీదు వద్ద బ్రిడ్జి పూర్తి చేస్తామని ప్రకటించారు. అవసరమైతే సొంత నిధులు సైతం వెచ్చిస్తానని మాధవిరెడ్డి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ మాటే మరుగున పడింది. నగరంలోని రోడ్ల విస్తరణ, కూడళ్ల అభివృద్ధి, వంతెనల నిర్మాణం పనులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా 2023 జూన్ 16వ తేదీన రూ.305.51 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చారు. వెంటనే పనులు ప్రారంభించారు. 6 పనులకు గాను 4 పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన 2 పనులను పూర్తి చేయాల్సి ఉంది. కాగా వాటిని ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్వయంగా రద్దు చేయించారు. వైఎస్సార్‌సీపీకి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి పేరు రాకూడదనే ఉద్దేశంతో వాటిని రద్దు చేయించిన ఎమ్మెల్యే, అవే పనులను జీఓ ఆర్టీ 285 ఏప్రెల్ 7న తాజాగా ఉత్తర్వులు తీసుకొచ్చి ప్రచార ఆర్భాటాల్లో మునిగితేలుతున్నారు.
కాదనలేని భయానక పరిస్థితులు
కూటమి సర్కార్ వచ్చిన తర్వాత మునుపెన్నడూ లేని రీతిలో నగరంలో వ్యక్తుల వ్యాపారాలు సైతం స్వాహా తెరపైకి వచ్చింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మద్యం వ్యాపారం చేస్తున్న లక్ష్మిరెడ్డికి చెందిన రెండు బార్ అండ్ రెస్టారెంట్లు తెలుగుతమ్ముళ్లు బలవంతంగా లాక్కున్నా రు. కాదనలేని పరిస్థితులు కల్పించారు. ఆపై వైరి పక్షంగా ఉన్నవారిపై పెత్తనం చెలాయించేందుకు కార్పొరేషన్, పోలీసు విభాగాలను యథేచ్ఛగా వాడుకుంటున్నారు. అధికారులు సైతం అధికార పార్టీ అండ ఉంటే చాలంటూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా రు. ఈక్రమంలో ఐఎంఏ ఆదేశాల మేరకు ప్రైవే టు ఆస్పత్రుల యాజమాన్యాలు లక్ష చొప్పున చెల్లించలేమంటూ బాహాటంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. అధికార, అనధికార సైన్యంతో ఇక్కట్లు ఎదుర్కొవాల్సివస్తుందేమోనని పలువురు వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సొంత నిధులతో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తామని ప్రకటన
ప్రతి వీధిలో సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఎన్నికల ముందు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అందుకు రూ.50లక్షలు వెచ్చించనున్నట్లు ప్రకటించారు. 9నెలలు తర్వాత ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు లక్ష చొప్పున చెల్లించాల్సిందిగా అల్టిమేటం జారీ చేయించారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు ఐఎంఏ ప్రతినిధులు వైద్యులకు మేసేజ్ పాస్ చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు లక్ష చొప్పున చెల్లించాల్సిందిగా ఎస్పీ పేరిట చెక్ ఇవ్వాల్సిందిగా దిశా నిర్దేశం చేశారు. అధికారం హోదా రాగానే సొంత నిధులు మాట కనుమరుగయ్యింది. ఇదేంటి ఎప్పుడూ లేని పరిస్థితులు జిల్లా కేంద్రంలో ఉత్పన్నమవుతున్నాయంటూ ప్రైవేటు వైద్యులు మదనపడుతున్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకుఎస్పీ పేరిట చెక్ జారీ చేయండి
ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలకు అల్టిమేటం జారీ!
ఎన్నికల ముందు సొంత డబ్బులతో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ
నేడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ ప్రైవేటుహాస్పిటల్స్‌పై వడ్డింపు

కప్పం కట్టాల్సిందే!