
‘కూటమి’ది మోసపూరిత పాలన
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల: అధికారంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఉదయం ఆయన పులివెందులలోని తన స్వగృహంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికలప్పుడు అధికారంలోకి రావడానికి కూటమి ప్రభుత్వం అనేక అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలంటూ కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లతో సహా ఇతర నాయకులు ఊదరగొట్టారని గుర్తు చేశారు. పథకాల అమలుకు రాష్ట్ర బడ్జెట్‌కు మించిన పని అని నిపుణులు ప్రశ్నించగా, సంపద సృష్టిస్తామని బీరాలు పలికారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే కష్టతరమని ప్రకటించి మోసానికి దిగారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తాడో అందరికి తెలిసిన విషయమేనన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఎంపీని సన్మానించిన ముస్లిం సోదరులు
బుధవారం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పట్టణంలోని ముస్లిం సోదరులు కలిశారు. ఈ సందర్భంగా వారు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీని సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ వారితో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తమ పార్టీ ఎంపీలు పార్లమెంటు, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. కూటమి ప్రభుత్వం తాము చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు వైఎస్సార్‌సీపీపై ఎల్లో మీడియా ద్వారా విషపు రాతలు రాస్తోందని ధ్వజమెత్తారు. ముస్లిం మైనార్టీ నాయకులు రసూల్, నూరుల్లా, ఖాదర్, మసీదుల ప్రెసిడెంట్లు పాల్గొన్నారు.
పంట నష్టపరిహారం అందివ్వాలి: ఈదురు గాలులు, వడగండ్ల వానతో పంట నష్టం జరిగిన అర టి రైతులు ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో టీడీపీ నాయకులు, రాష్ట్ర మంత్రి పర్యటించి వెంటనే నష్టపరిహారం అందిస్తామని చెప్పారని, ఇప్పటికీ నష్టపరిహారం అందలేదని, ఇంతలో మరోసారి ప్రకృతి ప్రకోపానికి పంట నష్టం జరిగిందని మొర పెట్టుకున్నారు. దీనికి ఎంపీ స్పందిస్తూ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని నష్టపరిహారం అందివ్వకుంటే పార్టీ తరపున ఆందోళనలు చేపడుతామని వారికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు శేఖరరెడ్డి, బలరామిరెడ్డి, అంబకపల్లె బాబు, తదితరులు ఉన్నారు.