
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
లింగాల: అకాల వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. ఇటీవల వీచిన ఈదురుగాలులకు లింగాలలో భారీ స్థాయిలో అరటి తోటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటించారు. ఈదురుగాలు లు, వడగండ్ల వానకు తీవ్రంగా దెబ్బతిన్న, నేలకూలిన అరటి పంటలను ఆయన పరిశీలించారు. గ్రామంలోని యోడుగూరు ప్రతాప్‌రెడ్డి, వేలూరు ఆనంద్‌రెడ్డి, తేరా గంగాధరరెడ్డి, రామచంద్రారెడ్డిల అరటి తోటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును విలపిస్తూ ఎంపీ అవినాష్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. వారం రోజుల్లో చేతి కందే పంట నోటికి అందకుండా పోయిందని, పంట సాగు కోసం లక్షలాది రూపాయలు వెచ్చించామని పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి నెలకొందని రైతులు విలపించారు. పంట చేతికి వస్తే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేద్దామనుకున్నామని, పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉందని.. తమను ఆదుకోవాలంటూ లోకేశ్వర మ్మ, వేలూరు నీలిమలు ఎంపీకి మొర పెట్టుకున్నారు.
● ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సోమవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు, వడగండ్ల వానకు మండలంలోని లింగాల, గుణకణపల్లె, చిన్నకుడాల, రామట్లపల్లె, పెద్దకుడాల, కామసముద్రం, బోనాల గ్రామాల్లో సుమారు 750ఎకరాలలో అరటి పంట నేలకూలిందన్నారు. మూడు వారాల క్రితమే మండలంలోని తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, వెలిదండ్ల, ఎగువపల్లె గ్రామాల్లో 1450ఎకరాలలో అరటి పంట ఈదురుగాలులు, వడగండ్ల వానకు తీవ్రంగా దెబ్బతిందన్నారు. మూడు వారాల వ్యవధిలోనే 2150ఎకరాలలో అరటి తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. రైతులు పంటల సాగు కోసం ఎకరాకు రూ.1.50లక్షల నుంచి రూ.2లక్షల వరకు వెచ్చించాల్సి వచ్చిందన్నారు. దీంతో మండల వ్యాప్తంగా రూ.42కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. రైతులను ప్రభుత్వాలు ఆదుకోవాలని, ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు వాతావరణ భీమాను రైతులకు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్చి నెలలో కూలిపోయిన అరటి పంటలకు మార్చి 31వ తేదీలోగా ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని చెప్పిందని, ఇంతవరకు ఇవ్వ లేదని ఆయన తూర్పారబట్టారు. ప్రభుత్వం ఎకరాకు రూ.14వేలు ఇన్‌పుట్ సబ్సిడీ మాత్రమే అందిస్తోందని, ప్రభుత్వం అందించే ఈ ఇన్‌పుట్ సబ్సిడీ కూలిపోయిన అరటి తోటలను తొలగించడానికి కూడా సరిపోదని మండిపడ్డారు. ఒక్క ఎకరాలో కూలిన అరటి పంటను తొలగించుకోవడానికి రైతులు రూ.20వేల నుంచి రూ.25వేలు కూలీలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 2024 ఖరీఫ్‌కు సంబంధించిన ఈ అరటి పంట 2023 ఇన్సూరెన్స్ గైడ్‌లైన్స్ ప్రకారం 2024–25కు వాతావరణ భీమా వర్తింపజేసి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు వాతావరణ బీమా అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు మండలంలో పనిచేయడం లేదని, కొన్ని పనిచేస్తున్నా అవి కచ్చితమైన వెదర్ అప్‌డేట్ అందించడంలేదని, పాడైపోయిన వాటిని వెంటనే తొలగించి నూతన ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లను, డివైజర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం సాకులు వెతకకుండా ఉద్యాన శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫొటోలు, రైతుల వివరాలను పరిగణలోకి తీసుకుని ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ బీమాలు అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బాబురెడ్డి, నియోజకవర్గ రైతు విభాగపు కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, యూత్ కన్వీనర్ మనోహర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల నాయకులు మల్లికార్జునరెడ్డి, మల్లికేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, నాగభూషణంరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ మండల కన్వీనర్ బాలసముద్రం రవి, లింగాల సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, వైఎస్సార్ సీపీ కడప పార్లమెంటరీ కన్వీనర్ భాస్కర్ రెడ్డి, పెద్ద కుడాల మాజీ సర్పంచ్ శ్రీనివాసులు రెడ్డి, హక్కులు వారి పల్లె సర్పంచ్ భాస్కర్ రెడ్డి, రామన్నూతనపల్లె, పెద్దకుడాల, లింగాల, చిన్నకుడాల గ్రామాలకు చెందిన నాయకులు, రైతులు పాల్గొన్నారు.
గాలివానకు దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
తమ గోడును విలపిస్తూ ఎంపీకి మొరపెట్టుకున్న మహిళా రైతులు

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి