
స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదాం
కడప సెవెన్‌రోడ్స్: స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా వైఎస్‌ఆర్ కడప జిల్లాను కాలుష్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శనివారం స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డితో కలిసి కలెక్టర్ ‘ఈ–చెక్‘ (ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ) కార్యక్రమాన్ని కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేసీ అదితిసింగ్, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడప నగరం ఏడురోడ్ల కూడలి నుంచి స్వచ్ఛత ర్యాలీని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. వన్‌టౌన్ సర్కిల్ వరకు సాగిన స్వచ్ఛతా ర్యాలీలో అధికారులు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, గ్రీన్ అంబాసిడర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ దివస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ శనివారాన్ని ‘ఈ–చెక్‘ అంశంతో మనం వాడిన ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థాలను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట్లాడుతూ ఈ మాసంలో ‘ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైక్లింగ్‘(ఈ వేస్ట్ రీసైక్లింగ్) అంశంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రభుత్వం సూచించిన మేరకు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించి పోగు చేసేందుకు కడప మున్సిపాలిటీలో ఒక అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేశామని, నగరంలోని నివాసాల నుంచి సేకరించిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరణ కేంద్రంలో అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్‌రెడ్డి, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, డీపీఓ రాజ్యలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య, ప్రజారోగ్య శాఖల అధికారులు, ఇంజినీర్లు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడపలో స్వచ్ఛతా ర్యాలీ

స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దుదాం