
వడ దెబ్బతో ఉపాధి కూలీలు మృతి
సింహాద్రిపురం : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శనివారం వడదెబ్బతో ఇద్దరు ఉపాధి కూలీలు మృతి చెందారు. సింహాద్రిపురం మండలం నంద్యాలమ్మ బావి న్యూ ఫీడర్ ఛానల్ కాలువ పనులరే వెళ్లిన ఓబుళరెడ్డి దాహం వేయటంతో నీరు తాగి కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయి మృత్యువాత పడ్డాడు. ఈ విషయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ భవాని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కరుణాకర్ రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉపాధి కూలీ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఏపీఓ జయభారతి, ఈసీ శ్రీనివాసులరెడ్డి, టీఏలు రజిత, లక్షుమయ్యలు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
అట్లూరు : మండల పరిధిలోని మణ్యంవారిపల్లె పంచాయతీ పార్వతీపురంలో చాట్ల పోలయ్య (43) అనే ఉపాధి కూలీ శనివారం ఉదయం సమీపంలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. అక్కడ తోటి కూలీలతో పనులు చేస్తూ మండే ఎండలకు తాళలేక ఉన్నపళంగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు, స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతునికి భార్య భాగ్యమ్మ, కుమారుడు సంపత్, కుమార్తె శృతి ఉన్నారు.

వడ దెబ్బతో ఉపాధి కూలీలు మృతి