
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
ఒంటిమిట్ట : మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామం, హరిజనవాడకు చెందిన ఎర్రబల్లి గంగాధర్ (31) అనే వ్యక్తి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఒంటిమిట్ట పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గంగాధర్‌కు 10 సంవత్సరాల క్రితం వల్లూరు మండలం, కొట్లూరు గ్రామంలో రెడ్డమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి సంతానం లేదు. గంగాధర్ వివాహం చేసుకున్నప్పటి నుండి మద్యానికి బానిస కావడంతో తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఎంత చెప్పినా భర్త గంగాధర్ మద్యాన్ని మానుకోకపోవడంతో భార్య రెడ్డమ్మ ఐదేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుండి గంగాధర్ వద్దకు భార్య రెడ్డమ్మ రాకపోగా మూడు నెలల క్రితం రెడ్డమ్మ మరో వివాహం చేసుకుందని భర్త గంగాధర్‌కు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన గంగాధర్ ఇక నేను బతకను.. చనిపోతాను అని బంధువులకు, ఊరి ప్రజలకు చెప్పుకుంటూ ఉండేవాడని, చివరకు ఈనెల 17వ తేది తన ఇంటివద్ద ఉన్న మామిడి తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు గంగాధర్‌ను కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
గాలి వాన బీభత్సం
చింతకొమ్మదిన్నె : ఆదివారం రాత్రి 9 గంటలకు వీచిన ఉధృతమైన గాలులకు, వర్షానికి మండల పరిధిలోని మద్దిమడుగు సుగాలి బిడికి గ్రామంలో పెద్ద చెట్లు విరిగిపడి కొన్ని ఇల్లు దెబ్బ తిన్నాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గ్రామానికి చెందిన బుక్కే గోమీలమ్మ మేకల మందపై పెద్ద చెట్టు పడడంతో సుమారు 20 పైగా మేకలు మృతి చెందాయి. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు అందరూ స్పందించి చెట్టుకొమ్మలను కత్తిరించి మేకలను బయటికి తీయడంతో కొన్ని బతికిపోయాయి. రాత్రి కావడం, విద్యుత్తు లేకపోవడంతో పూర్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.