
అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
కడప అర్బన్ : జిల్లాలో అగ్నిప్రమాదాల పట్ల నిరంతరం అప్రమత్తంగా వుండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలియజేశారు. జిల్లా అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు. ఈ వారోత్సవాల ముగింపు సందర్భంగా కడప ఫైర్ స్టేషన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ అగ్నిప్రమాదాలే కాకుండా విపత్తుల, రోడ్డు ప్రమాదాలలో కూడా అగ్నిమాపక శాఖ సిబ్బంది కీలకపాత్ర పోషిస్తూ ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా కృషి చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రధానంగా అగ్నిమాపక సేవలను కొనియాడారు. ఎక్కడైనా అగ్నిప్రమాదాలు జరిగితే ఆయా డిపార్ట్‌మెంట్‌ల వారు అగ్నిమాపక శాఖ వారు వచ్చేలోపు చేపట్టాల్సిన కార్యక్రమాలపై శిక్షణ పొందాలన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి ధర్మారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వంట గ్యాస్ ప్రమాదాలపై, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలపై అవగాహన ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ అధికారి బసివిరెడ్డి, కడప అగ్నిమాపక సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.