
భూములు కొనలేం.. లీజుకు మాత్రమే తీసుకుంటాం
జమ్మలమడుగు : సోలార్ పరిశ్రమ కోసం తాము భూములను రైతుల వద్దనుంచి కొనలేము. ఏడాదికి 32 వేల రూపాయలు కౌలుతో పాటు అడ్వాన్సుగా రెండు లక్షల రూపాయలు రైతులకు ఇస్తాము. దీనికి సానుకూలంగా ఉన్న రైతుల నుంచి భూములను తీసుకుంటాము.. అని సోలార్ కంపెనీ ప్రతినిధులు రైతులకు స్పష్టం చేశారు. సోమవారం పెద్దముడియం మండలం తహసీల్దార్ కార్యాలయంలో కల్వటాల గ్రామానికి చెందిన డీకేటీ పట్టాలు కలిగిన రైతులతో తహసీల్దార్ నరసింహులు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు సరైన గిట్టుబాటు ధరతో భూములు కొనుగోలు చేస్తే తాము తమ భూములను సోలార్ కంపెనీకి ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు. అయితే యాజమాన్యం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో తాము భూములను కొనుగోలు చేయలేమని లీజుకు మాత్రమే తీసుకుంటామన్నారు. దీంతో రైతులు కూడా ఆలోచించి చెబుతామని వెళ్లిపోయారు.
మాకు న్యాయం చేయాలి..
తమకు పట్టాలు లేవు. అయితే భూములను అనుభవంలోకి తెచ్చి సాగు చేసుకుంటున్నామని తమకు న్యాయం జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కల్వటాల గ్రామానికి చెందిన రైతులు తహసీల్దార్ నరసింహులుకు వినతి పత్రం ఇచ్చారు. కొండ భూములను తాము చదును చేసుకోవడంతో పాటు భూమిగా మార్చుకోవడం కోసం భూమిపై ఎంతో ఖర్చు పెట్టామన్నారు. ప్రస్తుతం సోలార్ కంపెనీకి తమ భూములు కేటాయిస్తే తాము అన్యాయమైపోతామని వారు వాపోయారు. ఈ కార్యక్రమంలో సోలార్ కంపెనీ ప్రతినిధి నరేన్ చౌదరి, వైఎస్సార్‌సీపీ నాయకులు శేఖర్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, మహేష్ పాల్గొన్నారు.
సేల్ యాజమాన్యం స్పష్టీకరణ