
‘చింతమనేని’పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
జేసీకి జర్నలిస్టుల వినతి
కడప సెవెన్‌రోడ్స్: ఏలూరు సాక్షి దినపత్రిక కార్యాలయంపై దాడికి పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పి.రామసుబ్బారెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వెన్ను శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని తొలినుంచి క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తి అని, అలాంటి వారిని అందలమెక్కిస్తే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలే చోటుచేసుకుంటాయన్నారు. ఎమ్మెల్యే, అతని అనుచరవర్గం సాక్షి కార్యాలయంపై దాడి చేసి కంప్యూటర్లు ధ్వంసం చేయడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న విలేకరిపై దాడి చేయడం దారుణమన్నారు. సాక్షి పత్రికలో తమకు వ్యతిరేకంగా వార్త వచ్చిందని దాడి చేయడం దుర్మార్గమన్నారు. పత్రికలో వచ్చిన వార్తలో వాస్తవాలు లేకపోతే వివరణ ఇవ్వాలేగానీ కార్యాలయాలపై, విలేకరులపై దాడులు చేయడం అప్రజాస్వామికమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందన్నారు. చంద్రబాబు వెంటనే స్పందించి చింతమనేనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయనపై చట్టపరమైన చర్యలు చేపట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దిశ బ్యూరో ఇన్‌ఛార్జి మన్యం శివరాం, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్టర్ నాగరాజు, సాక్షితో పాటు వివిధ మీడియా సంస్థల జర్నలిస్టులు విలియమ్స్, ప్రసాద్, ఆనంద్, భూమిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి, రవికుమార్, ఫణి, కిషోర్, యల్లారెడ్డి, జయరాజు, దుర్గా ప్రసాద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.