
అంధుల ప్రభుత్వ పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత
కడప ఎడ్యుకేషన్ : కడప శంకరాపురం ప్రభుత్వ అంధుల ఉన్నత పాఠశాల పది ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించింది. ఈ పాఠశాల నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను నలుగురు పరీక్ష రాయగా నలుగురు ఉత్తీర్ణులై వందశాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో దువ్వూరు గురమ్మ 323 మార్కులు, మంగోని స్వర్ణలత 322 మార్కులు, బాతల రెవంత్‌కుమార్ 321 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో(ఫస్ట్ క్లాస్) నిలువగా, లింగాల నందీశ్వరెడ్డి 229 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో (సెకెండ్ క్లాస్) నిలిచారు. తమ పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ప్రధానోపాధ్యాయుడు ఎబినైజర్ హర్షం వ్యక్తం చేశారు.
వేంపల్లి శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం
వేంపల్లె : పదవ తరగతి పరీక్షా ఫలితాలలో స్థానిక శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ పాఠశాల కరస్పాండెంట్ బి.చక్రపాణి రెడ్డి తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలలో జి సాయినాథ్ 600/597 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడవ స్థానం, జిల్లా స్థాయిలో రెండవ స్థానం సాధించారన్నారు. అలాగే పి. గురుభావన 595, బి.వి ఉదయ్ అర్జున్ 592లు సాధించారని తెలిపారు. అలాగే 590కిపైగా 40 విద్యార్థులు, 580–590 మధ్య మార్కులు 7 మంది విద్యార్థులు, 550–580 మార్కుల మధ్య 32 మంది విద్యార్థులు రాణించారన్నారు. మొత్తం 155 మంది విద్యార్థులు హాజరు కాగా, 500 మార్కులకు పైగా 95 మంది విద్యార్థులు సాధించారన్నారు.