
కేసుల పరిష్కారంలో అందరి సహకారం అవసరం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
డాక్టర్ సి.యామిని
కడప అర్బన్ : కేసుల పరిష్కారం విషయంలో కడప బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదుల సహకారం అవసరమని జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సి.యామిని అన్నారు. కడప కోర్టులో పనిచేసి బదిలీపై వెళ్తున్న న్యాయ మూర్తులు జె.నందిని, జె,హేమస్రవంతి, భార్గవిలకు శుక్రవారం వీడ్కోలు సభ నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి సి.యామిని మాట్లాడుతూ కేసులు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. బదిలీపై వెళ్తున్న న్యాయమూర్తులు జే.నందిని, జే.హేమ స్రవంతి, భార్గవి మాట్లాడుతూ కడప కోర్టులో పని చేసినంత కాలం త్వరితగతిన కేసులు పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకరించారన్నారు. బదిలీపై వెళ్లిన చోట బాధ్యతగా విధులు నిర్వర్తించి కేసు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కడప బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు ఎ.ఉమాదేవి ప్రధాన కార్యదర్శి చంద్రవదన, సురేష్‌కుమార్, ఎల్. వెంకటేశ్వరరావు, కె. ప్రత్యూష కుమారి, ఎస్.బాబా ఫకృద్దీన్, అసోసియేషన్ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.