
పోలీసుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్
– జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్
కడప అర్బన్ : పోలీసు శాఖ సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ పోలీస్ స్టేషన్లు, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది తమ వ్యక్తిగత, బదిలీలు, స్పౌస్, వైద్య సమస్యలపై ఎస్పీకి విన్నవించారు. వారి సమస్యలను విన్న ఎస్పీ తగిన పరిష్కారం చూపుతామని సిబ్బందికి భరోసా ఇచ్చారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత జిల్లా పోలీసు కార్యాలయ అధికారులను ఆయన ఆదేశించారు.
ఒడిషా వాసి మృతి
వేముల : రహదారి పనులు చేస్తున్న టిప్పర్ కింద పడి ఒడిషా రాష్ట్రానికి చెందిన రాజునాయక్(56) శుక్రవారం మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. ఒడిషా రాష్ట్రంలోని గంజామ్ జిల్లాకు చెందిన రాజునాయక్ నెల రోజుల కిందట డీబీఎల్ కంపెనీలో కూలి పనుల్లో చేరాడు. డీబీఎల్ కంపెనీ గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల్లో భాగంగా గురువారం రాత్రి టిప్పర్‌తో మట్టిని రోడ్డు పనులకు తరలిస్తున్నారు. ప్రమాదవశాత్తూ టిప్పర్ రాజునాయక్‌పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి మృతుడి బావమరిది బజ్యా నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప అగ్రికల్చర్ : ఏపీ పశుసంవర్థ శాఖ ఆధ్వర్యంలో ఊటకూరు కోళ్ల ఫారంలో మూడు ప్రధాన యూనిట్ల అభివృద్ధికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శారదమ్మ తెలిపారు. పబ్లిక్, ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ యూనిట్లకు ముందస్తుగా పెట్టుబడి అవసరం లేదని, ప్రభుత్వ మౌలిక వసతులను వాడుకునే అవకాశాన్ని ఇస్తామన్నారు. నిర్వహణ, నాణ్యత, ఉత్పత్తి పెరుగుదల అంశాల్లో నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు.
రిమ్స్ ఓపీలోక్యాంటీన్ ప్రారంభం
కడప అర్బన్ : కడప నగర శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్) ఓపీలో 24 రోజుల తరువాత క్యాంటీన్ గురువారం తిరిగి ప్రారంభించారు. క్యాంటీన్ తెరవ లేదని, ప్రజలు, వైద్యులు, సిబ్బంది ఇబ్బందిపడుతున్నారనీ ఇటీవల పత్రికలలో వార్తలు రావడంతో స్పందించిన ఆస్పత్రి అధికారులు క్యాంటీన్‌ను ఒకరికి అప్పగించారు. త్వరలో జరిగే ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశంలో అక్కడ ఏ పద్ధతిలో ఇవ్వాలనేది తీర్మానించనున్నట్లు అధికారులు తెలియజేశారు.