
అనుమానాస్పద స్థితిలో ఆర్మీ ఉద్యోగి మృతి
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని నారాయణ పాఠశాలకు వెళ్లే రహదారి సమీపంలో దేవిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి (55) శనివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు విజయ భాస్కర్ రెడ్డికి భార్య పద్మావతి, కుమారుడు కార్తీక్ రెడ్డి, కుమార్తె దీపిక రెడ్డి ఉన్నారు. ఇటీవల విజయభాస్కర్ రెడ్డికి, పద్మావతికి కుటుంబ సమస్యల వల్ల ఇద్దరు వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. పద్మావతి కుమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి ముద్దనూరు రోడ్డులో ఉంటున్నారు. విజయభాస్కర్ రెడ్డికి బీపీ, షుగర్ ఎక్కువగా ఉండటంవల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, దీనికి తోడు కుటుబ సమస్యలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో విజయభాస్కర్ రెడ్డి మంచంపై మృతి చెంది పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకున్నారు. అతను ఆరోగ్యం సరిగా లేక మృతి చెందాడా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.