● పల్లె గొంతులు ఎండుతున్నాయి..
● పలు గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి
● తాగునీటి రవాణా, అద్దెబోర్ల ఏర్పాటు
● అడుగంటుతున్న భూగర్భ జలాలు
కడప సెవెన్‌రోడ్స్ : పల్లె గొంతులు తడారుతున్నాయి. గుక్కెడు మంచి నీటికోసం అల్లాడుతున్నాయి. అడుగంటిన భూగర్భ జలాలతో జిల్లాలలోని పలు గ్రామాలు తాగునీటి కోసం తల్లడిల్లుతున్నాయి. వేసవి తీవ్రత అధికంగా ఉండడంతో జిల్లాలోని పలు గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. సరిపడా తాగునీరు లేక మనుషులు, పశువులు విలవిల్లాడాల్సిన దుస్థితి తలెత్తింది. అనేక మండలాల్లో భూగర్భ జలాలు శరవేగంగా అడుగంటుతున్నట్లు అధికారుల నుంచి నివేదికలు అందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మరిన్ని గ్రామాలను తాగునీటి ఎద్దడి చుట్టుముట్టనుంది. ఇప్పటికే చాలాచోట్ల తాగునీటి రవాణా, వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకోవడం వంటి ఉపశమన చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఇంకా రెండు నెలలపాటు నీటి ఎద్దడిని ఎదుర్కొవాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వర్షాలు సంవృద్ధిగా సకాలంలో కురిస్తే తప్ప నీటి ఎద్దడి నుంచి త్వరగా బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ముందుచూపుగా వ్యవహరించి ఉంటే ప్రజలకు ఈ కష్టాలు తప్పేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
● జిల్లాలోని 18 మండలాల్లో తాగునీటి ఎద్దడి అధికంగా ఉన్నట్లు అధికారుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. గ్రామ పంచాయతీ నిధులతో బోరు బావులను అద్దెకు తీసుకోవడం, తాగునీటిని ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరఫరా చేసే చర్యలు చేపట్టారు. కొన్నిచోట్ల కొత్త బోరుబావులను ఏర్పాటు, ఉన్న బోరుబావులను లోతు చేయడం వంటి పనులు చేపట్టారు. దాహ మేశాక బావి తవ్విన చందంగా ఉపశమన చర్యలు ఆలస్యంగా చేపట్టారు.
● పోరుమామిళ్ల మండలం వెంకటాపురం పంచాయతీలోని ముద్దంవారిపల్లె, వీఎన్ పల్లె మండలం అలిదెన పంచాయతీలోని ఎ.ఓబాయపల్లె, పెద్దముడియం మండలం దిగువ కల్వటాల పంచాయతీలోని బీసీ కాలనీ, చక్రాయపేట మండలం గడ్డంవారిపల్లె పంచాయతీ బయమ్మగారిపల్లె, మద్దికవాండ్లపల్లె, తాటికాడపల్లె, గండిలలో వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకున్నారు. అదే గ్రామ పంచాయతీలోని బీసీ కాలనీలో రవాణా జరుగుతోంది. ఈ గ్రామాల్లో జనవరి నుంచే నీటి ఎద్దడి ఉండడంతో అధికారులు ఈ చర్యలకు ఉపక్రమించారు. వేంపల్లె మండలం రాజీవ్ కాలనీ, మైలవరం మండలం బెస్తవేముల పంచాయతీలో ని జంగాలపల్లె, బెస్తవేముల, పెద్దముడియం మండలం దిగువ కల్వటాల బీసీ కాలనీలో పాపాయపల్లె, చక్రాయపేట మండలం సురభి గ్రామ పంచాయతీలోని లక్ష్మీపురం గ్రామాల్లో తాగునీరు రవాణా చేస్తున్నారు. దువ్వూరు మండలం చిన్న సింగనపల్లె, ఎస్సీకాలనీ, ఎర్రగుంట్ల మండలం వలసపల్లె, ఒంటిమిట్ట మండలం కె.మాధవరం పంచాయతీలోని ముకుందాశ్రమం గ్రామాల్లో సైతం నీటి ఎద్దడి అధికంగా ఉన్నట్లు అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
● గత సంవత్సరం జూన్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేది వరకు జిల్లా సాధారణ వర్షపాతం 636.05 మిల్లీమీటర్లకుగాను 772.6 మిల్లీమీటర్లు నమోదైందని అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. డీవియేషన్ 21.47గా ఉంది. జిల్లాలో ఈ ఏడాది మార్చికి సగటున భూగర్భ జల మట్టం 10.62 మీటర్ల లోతులో ఉంది. మండలాల వారీగా పరిశీలిస్తే అట్లూరు 13.47 మీటర్లు, బి.కోడూరు 10.51, బద్వేలు 10.04, బి.మఠం 1.32, చక్రాయపేట 8.47, చాపాడు 5.23, చెన్నూరు 6.34, సీకే దిన్నె 4.86, దువ్వూరు 10.22, జమ్మలమడుగు 8.77, కలసపాడు 12.88, కమలాపురం 4.03, ఖాజీపేట 14.78, కొండాపురం 5.67, లింగాల 7.02, ముద్దనూరు 12.82, మైలవరం 3.07, పెద్దముడియం 9.9, పెండ్లిమర్రి 25.02, పోరుమామిళ్ల 11.99, ప్రొద్దుటూరు 4.23, పులివెందుల 33.86, రాజుపాలెం 7.04, ఎస్.మైదుకూరు 7.88, సిద్దవటం 19.09, సింహాద్రిపురం 6.04, కాశినాయన 19.09, తొండూరు 6.09, వల్లూరు 5.94, వీఎన్ పల్లె 9.01, వేంపల్లె 8.93, వేముల 5.71, ఎర్రగుంట్ల 5.34 మీటర్లలో భూగర్భ జలాలు ఉన్నాయి.
నీటి ఎద్దడి నివారణకు రూ. 5.67 కోట్లతో ప్రతిపాదనలు
వేసవి కావడంతో జిల్లాలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రజలకు తాగునీరు అందించేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టాం. ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా, వ్యవసాయ బోరు బావులు అద్దెకు తీసుకోవడం, బోర్ల డీపెనింగ్, ఫ్లషింగ్, కొత్త బోర్ల ఏర్పాటు లాంటివి చేస్తున్నాం. జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులు, గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఇందుకు ఖర్చు చేస్తున్నాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు కోసం రూ. 5.67 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఎక్కడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అవసరమైన చర్యలను తీసుకుంటున్నాం. – ఏడుకొండలు, పర్యవేక్షక ఇంజనీరు, ఆర్‌డబ్ల్యూఎస్, కడప
పల్లె.. తల్లడిల్లె !