
సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్: మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ముస్లిం, క్రిస్టియన్, బుద్దిస్ట్, సిక్కు, జైను, పార్సీ మైనార్టీల సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి షేక్ హిదాయతుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఏపీఓబీఎంఎంఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థి వయసు 21–55 ఏళ్ల మధ్య ఉండాలని, ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతం వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షలుగా నిర్ణయించారన్నారు. రూ.లక్ష యూనిట్‌కు సంబంధించి 50 శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.3 లక్షల యూనిట్ ఖర్చు వరకు గరిష్టంగా రూ.1.25 లక్షలు సబ్సిడీ, రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు యూనిట్ ఖర్చుకు గరిష్టంగా రూ.2 లక్షల సబ్సిడీ, రూ.5 నుంచి రూ.8 లక్షల యూనిట్ (డి.ఫార్మా/బి.ఫార్మా విద్యార్థులకు ప్రత్యేక కథనం) 50 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్ డి–బ్లాక్‌లో గల ఈడీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.
14 నుంచి బ్రహ్మోత్సవాలు
రాజంపేట రూరల్: శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను మే 10వ తేది నుంచి 14వ తేది వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారుడు పసుపులేటి వీరప్రదీప్‌కుమార్ తెలియజేశారు. భువనగిరిపల్లి వద్దనున్న లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆలయ ధర్మకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని భక్తులు పాల్గొనాలని వారు కోరారు.