
మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్న బీజేపీ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : దేశంలో గత పదేళ్లుగా బీజేపీ హిందుత్వ మత ఉన్మాదాన్ని ప్రేరేపిస్తోందని, కుల వివక్ష, ముస్లింలు, దళితులపై దాడులు పెరిగాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం కడప నగరంలోని రామకృష్ణ నగర్‌లో సీపీఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది చనిపోయారని, ఉగ్రవాదులను అడ్డుకున్న ముస్లిం యువకుల్ని గ్రవాదులు కాల్చి చంపారని చెప్పారు. వాస్తవాలు ఇలా ఉండగా, దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వ ప్రచార బీజేపీ సంఘ్ పరివార్ శక్తులు ముస్లింలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. దీన్ని ముస్లిమేతర సమాజం వ్యతిరేకించాలన్నారు. ఈ మారణ హోమానికి కేంద్ర ప్రభుత్వం భద్రతా వైఫల్యం కారణమన్నారు. మోడీ, అమిత్ షాలే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనది ఎన్డీఏ ప్రభుత్వం అని తరచూ చెబుతున్నారని కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకుని వచ్చిన సందర్భాలు లేవన్నారు. ఉండి నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు నగర్ ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు మద్దతు ఇచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పట్ల అనుచితంగా మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజును బర్తరఫ్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్, ఏ.రామ్మోహన్, వి.అన్వేష్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కే.శ్రీనివాసుల రెడ్డి, పి.దస్తగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.