
‘ఉర్సా’కు కారుచౌకగా భూములు కట్టబెట్టడం దారుణం
కడప కార్పొరేషన్ : విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములను ‘ఉర్సా’ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి అత్యంత కారుచౌకగా కట్టబెట్టడం దారుణమని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎకరా భూమిని టీసీఎస్ కంపెనీ, ఉర్సా కంపెనీలకు కేవలం ఒక రూపాయికే కట్టబెట్టడం అన్యాయమన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలా ప్రభుత్వ భూములను తక్కువ ధరకే ఇవ్వడం సరికాదన్నారు. 2003లో కూడా చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాగే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐఎంజీ కంపెనీకి 850 ఎకరాలను కేటాయించారని, వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని రద్దు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇలా ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా భూములు కట్టబెడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, కార్యదర్శి సుహైల్ అహ్మద్, ఐటీ విభాగం నగర అధ్యక్షుడు ఫయాజ్ పాల్గొన్నారు.