
వాహిద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
కడప కార్పొరేషన్ : ఒక మహిళను మోసం చేసి, ఆమె సోదరుడిపై దాడి చేయించిన కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి పీఏ వాహిద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండిదీప్తి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి ఆయేషా అనే మహిళను రెండో వివాహం చేసుకున్న వాహిద్, పెళ్లి అయినప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలు పెట్టాడన్నారు. ఆమె నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తుండేవాడన్నారు. ఇదేమని ప్రశ్నించిన ఆమె సోదరుడిపై వాహిద్ అనుచరులు శనివారం రాత్రి దాడి చేశారన్నారు. రక్తగాయాలతో వెళ్లి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదన్నారు. అర్థరాత్రి ఆయేషా సోదరుడితో కలిసి ఎమ్మెల్యే ఇంటివద్దకు వెళ్లి ఆమెకు వాయిస్ మెసేజ్‌లు పెట్టి మొరపెట్టుకున్నా పట్టించుకునేవారు కరువయ్యారన్నారు. మహిళలకు రక్షణ కావాలి, భద్రత ఉండాలని అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే మాధవి తన వద్దకు వచ్చిన మహిళకే రక్షణ ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎంతోమంది మహిళలను వాహిద్ లైంగికంగా వేధించాడని ఆరోపించారు. దాడికి పాల్పడిన వాహిద్, అతని అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దిశ చట్టం ఉన్నప్పుడే మహిళలకు తగిన భద్రత, రక్షణ ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయేషాకు న్యాయం జరిగేంత వరకూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ఈ సమావేశంలో మహిళా విభాగం రాష్ట్ర నేతలు మూలే సరస్వతీదేవి, రత్నకుమారి, కో ఆప్షన్ సభ్యురాలు బండి మరియలు, నారాయణమ్మ, శ్రీదేవి, సుశీలమ్మ పాల్గొన్నారు.