
సాంకేతిక విద్య.. భవితకు భరోసా!
కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతి తరువాత వీలైనంత తొందరగా ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి పాలిటెక్నిక్ కోర్సులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. సాధారణంగా పదవ తరగతి తరువాత ఇంటర్, డిగ్రీ కోర్సులు చేయడం సాధారణం. అయితే డిగ్రీ పూర్తయి ఉద్యోగం వచ్చేంత సమయం లేకపోవడంతో చాలామంది పాలిటెక్నిక్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. పదవ తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిసెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలలో ఉత్తమ ర్యాంకు సాధించిన వారికి రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి. ఇటీవలే పదవ తరగతి పరీక్షలు కూడా ముగిశాయి. ఫలితాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా పాలిసెట్ కోసం దాదాపు 8 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
మెండుగా ఉద్యోగ అవకాశాలు..
పదవ తగరతి చదివిన వెంటనే సాంకేతిక విద్య చదవాలనే గ్రామీణ పేద విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సు గొప్ప అవకాశం. ఇంజనీరింగ్ వంటి అత్యున్నత సాంకేతిక విద్య అభ్యసించడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. పాలిటెక్నిక్‌లో ఏ కోర్సు చేసినా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. దీంతో భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల వివిధ సంస్థలు నేరుగా కళాశాలలకు వెళ్లి పాలిటెక్నిక్ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులను తమ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారు.
ఈ నెల 30న ప్రవేశ పరీక్ష..
ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ పరీక్ష రాయాల్సిందే. పాలిసెట్ దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 17వ తేదీతో గడువు ముగిసింది. ఈ నెల 30వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్షను కూడా నిర్వహించనున్నారు. ఈ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ఇందులో గణితం 50 మార్కులకు, ఫిజిక్స్ 40 మార్కులకు, కెమిస్ట్రీ 30 మార్కులకు ఉంటుంది. పదవ తరగతి సిలబస్ ఆధారంగా పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష కోసం కడప, ప్రొద్దుటూరులలో 16 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 వేల మంది దాకా ఈ పాలిసెట్ ప్రవేశ పరీక్షను రాయనున్నారు.
కోర్సుల వివరాలు ఇలా..
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో సివిల్, మెకానికల్, త్రిబుల్ ఈఈ, కంప్యూటర్ మెకానిక్, ఈసీఈ, ఎంఈసీలతోపాటు ఒకటి రెండు కొత్త కో ర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. జిల్లా మొ త్తం పైన ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 15 పాలిటెక్నిక్ కళాశాలకుగాను 5600 సీట్లు అందుబాటులో ఉన్నా యని అధికారులు తెలిపారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ నిర్వహించారు. ఈ ఉచిత కోచింగ్ 28వ తేదీతో ముగిసింది.
పదవ తరగతి విద్యార్థులకు
చక్కటి అవకాశం
పాలిటెక్నిక్ విద్యతో మంచి ఉద్యోగావకాశాలు
రేపు పాలిసెట్ ప్రవేశ పరీక్ష
జిల్లాలో 8 వేల మంది దాకా పరీక్ష రాయనున్న విద్యార్థులు
జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి సంబంధించిన పాలిసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకుఅన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ జిల్లా కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు. సోమవారం కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో అడిషనల్ కో ఆర్డినేటర్ దామోదరంతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష కోసం కడపలో 12 పరీక్షా కేంద్రాలను, ప్రొద్దుటూరులో నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ 16 పరీక్షా కేంద్రాలలో దాదాపు 12500 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాస్తున్నారని తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుందని తెలిపారు. విద్యార్థులంతా ఉదయం 10 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఎవరికై నా ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ కాకపోతే 29వ తేదీ మధ్యాహ్నంలోగా కడపలోని ప్రభుత్వ మహిళా కళాశాలను సంప్రదించాలని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి పరీక్ష రాసేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.

సాంకేతిక విద్య.. భవితకు భరోసా!