
టీడీపీ నేతల కుట్రలతోనే మేయర్‌పై అనర్హత
● దేశంలో ఎక్కడా ఇలాంటి సంఘటన జరగలేదు
● మేయర్ అవినీతికి పాల్పడినట్లు
విజిలెన్స్ విచారణలో లేదు
● వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఆగ్రహం
కడప కార్పొరేషన్ : టీడీపీ నేతల కుట్రలతోనే మేయర్ సురేష్‌బాబుపై అనర్హత వేటు పడింతే తప్పా హైకోర్టు తొలగించలేదని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మల్లికార్జున, కె.బాబు, ఎస్‌ఏ షంషీర్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో శనివారం వారు మాట్లాడుతూ టీడీపీ నగర ప్రధాన కార్యదర్శిగా కొత్తగా నియమితులైన సుబ్బారెడ్డి మాట్లాడిన మాటలన్నీ శుద్ధ అబద్ధాలన్నారు. మేయర్‌గా సురేష్‌బాబు అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో ఎక్కడా లేదని, ఎమ్మెల్యే మాధవి ప్రభుత్వానికి రాసిన తన లేఖలోనూ ఆ విషయం చెప్పలేదన్నారు. మేయర్ కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్ పనులు చేయకూడదన్న ఒకే ఒక్క కారణం చూపి ఆయనపై అనర్హత వేటు వేశారన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సంఘటన జరగలేదన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎనిమిది మంది కార్పొరేటర్లలో నలుగురు వైఎస్సార్‌సీపీలో కీలకంగా వ్యవహరించారని, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా వారికి అగ్రపీఠం వేశారని గుర్తుచేశారు. టీడీపీలో రెండు, మూడు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ బజారున పడుతున్నారేగానీ, ఇందులో వైఎస్సార్‌సీపీ పాత్ర ఏమీ లేదన్నారు. మాజీ మేయర్ సురేష్ బాబును విమర్శించే స్థాయి, అర్హత సుబ్బారెడ్డికి లేదన్నారు. ఎమ్మెల్యే మాధవిని టీడీపీలోని ఓ మహిళ ఏడాదిన్నర క్రితం దూషించి వీడియో పెట్టారని, ఆమెను నిన్న, మొన్న అరెస్ట్ చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడిగా ఉన్న శివకొండారెడ్డి అప్పుట్లోనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. ఎమ్మెల్యే మనుషులు నడిరోడ్డుపై శివకొండారెడ్డిపై దాడిచేసి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. మేయర్ సురేష్‌బాబు వేసింది చెత్త కాదని, హాస్పిటల్ వేస్ట్ అయిన నీడిల్స్, చీము, నెత్తురుతో ఉన్న దూది, కత్తిరించిన వేళ్లు వేశారన్నారు. కుర్చీ వేయకుండా మహిళా ఎమ్మెల్యేను అవమానించారని మొత్తుకుంటున్న వీళ్లకు..సురేష్ బాబు సతీమణి మహిళ అన్న సంగతి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. డీఎంఎఫ్ నిధులు, కుడా నిధులు ఈ ప్రాంత ప్రజలు కట్టిన పన్నుల నుంచే వచ్చే వాటా తప్పా ప్రభుత్వం ఇచ్చేవి కావన్నారు. వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు మాట్లాడుతూ సుబ్బారెడ్డి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి టీడీపీ నగర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడాలని హితవు పలికారు. వైఎస్సార్‌సీపీ భిక్షతో పదవులు వచ్చాయన్న విషయం మరిచిపోవద్దన్నారు. సుబ్బారెడ్డిని వైఎస్సార్‌సీపీ నాయకులంతా సమష్టిగా కృషి చేసి ఏకగ్రీవం చేయించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం 16 నెలల్లో కడపకు రూపాయి మంజూరు చేయలేదని, కుడా నుంచి వచ్చే నిధులు, లేఔట్ల నుంచి వచ్చిన ఆదాయంతోనే పాలన సాగిందన్నారు. కె.బాబు, శివకోటిరెడ్డి, షంషీర్, రామలక్ష్మణ్‌రెడ్డి, చంద్రహాసరెడ్డి, షఫీ, అజ్మతుల్లా, గౌస్, అక్బర్, త్యాగరాజు, కిరణ్, నాగమల్లారెడ్డి, సుబ్బరాయుడు, శంకరాపురం సింధు, శ్రీరంజన్‌రెడిడ, డిష్ జిలాన్, రెడ్డి ప్రసాద్, బండి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.