తక్షణ చికిత్సతోనే ప్రాణాలకు రక్షణ | - | Sakshi
Sakshi News home page

తక్షణ చికిత్సతోనే ప్రాణాలకు రక్షణ

Sep 28 2025 7:20 AM | Updated on Sep 28 2025 7:20 AM

తక్షణ

తక్షణ చికిత్సతోనే ప్రాణాలకు రక్షణ

కుక్క కాటు ప్రమాదం

కుక్క కరిచిన ప్రదేశాన్ని సబ్బు నీళ్లతో శుభ్రం చేసుకుని సరిపెట్టుకునే వాళ్లుంటారు. కానీ పెంపుడు కుక్క, వీధి కుక్క... ఏది కరిచినా రేబీస్‌ రాకుండా ఇంజెక్షన్లు తీసుకోవడం తప్పనిసరి. కుక్క కరిచిన వెంటనే వైద్యుడిని సంప్రదించి టీకా వేయించుకుంటే రేబిస్‌ బారినుంచి తప్పించుకోవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. 28న రేబిస్‌ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

కడప అగ్రికల్చర్‌: కడప ప్రభుత్వ ఆస్పత్రికి కుక్క కాటు కేసులో ఏటా పెరుగుతున్నాయి. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు 10,104 మంది కుక్క కాటుకు గురై చికిత్స తీసుకున్నారు. ఏటా సెప్టెంబర్‌ 28న రేబిస్‌ వ్యాధి నివారణ దినం నిర్వహిస్తూ.. ప్రభుత్వం కుక్క కాటుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే వీధి కుక్కల బెడద ఇటీవల పెరగడంతో పలువురు కుక్క కాటుకు గురవుతున్నారు. ప్రాథమిక ఆస్పత్రుల్లో సకాలంలో మందులు లేకపోవడంతో వేల రూపాయలు బయట ఆస్పత్రులకు ఖర్చు చేస్తున్నారు. వీధి కుక్కలను తరలించడంలో మున్సిపాల్టీ అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంతో ఏటా కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి.

వ్యాధి ఎలా వస్తుంది

గబ్బిలాలు, పిల్లులు, నక్కలు, కోతి లాలాజలంలో రేబిస్‌ ఉంటుంది. అవి కరచినా, వాటి లాలాజలం శరీరభాగాల్లోని ద్రవాల్లోనూ, గాయాల పైనా పడినా ప్రాణాంతకరమైన రేబిస్‌ వ్యాధికి దారి తీస్తుంది. రేబిస్‌ వైరస్‌ సోకిన కుక్క కరిస్తే తొలుత కండరాలకు, అనంతరం శ్వాసకోశ నాళాలకు వైరస్‌ సోకుతుంది.. చలాకీగా కదిలే కుక్క అకస్మాత్తుగా నీరసించడం, ఒంటరిగా ఉండిపోవడం, నోటి నుంచి సొంగ కారడం, నీటికి దూరంగా ఉండడం, గుండ్రంగా తిరుగుతూ ఉండడం వంటి లక్షణాలు కనిపించిన కుక్కకు దూరంగా ఉండాలి. వాటికి ఆహారం తినిపించడం, ఆడుకోవడం చేయరాదు.

కరిస్తే కనిపించే లక్షణాలు

కుక్క కరచిన మనిషికి ఆకలి తగ్గడం, తల తిరగడం, జ్వరం రావడం, నీరు చూసినా భయపడడం వంటి లక్షణాలుంటాయని తెలిపారు. కుక్కలకు సోకే రేబీస్‌ వైరస్‌ శరీరంలో దీర్ఘకాలం పాటు ఉండిపోతుంది. కుక్క ప్రాణాలు కోల్పోయేలోపు ఎంతమందిని కరిస్తే అంతమందికీ రేబీస్‌ వైరస్‌ సోకుతుంది. కుక్క గోళ్లు గీసుకున్నప్పుడు వెంటనే సబ్బు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కొరికినప్పుడు పన్ను లోపలకు దిగి రక్తం కారితే ఆ ప్రదేశంలో ఇమ్యునోగ్లోబ్యులిన్‌ ఇంజెక్షన్‌ తీసుకోవాలి, రేబీస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. వ్యాధి బాగా ముదిరితే మనిషి కుక్కలా ప్రవర్తిస్తారు. కోమాలోకి వెళ్లి శ్వాస ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు.

ఏది కరిచినా..

కుక్క కరిచినప్పుడు, ఎంత లోతుగా కరిచింది అనే దాని మీదే చికిత్స ఆధారపడి ఉంటుంది. కుక్క గోళ్లతో గోకడాన్ని గ్రేడ్‌ ఎగా, కొరికినప్పుడు పంటిగాటు ఏర్పడితే ఆ గాయాన్ని గ్రేడ్‌ బిగా, పంటిగాటుతోపాటు రక్తస్రావమైతే గ్రేడ్‌ సిగా పరిగణించాలి. ఈ గాయాలకు రేబిక్యూర్‌ వ్యాక్సిన్‌తో పాటు, రేబీస్‌ ఇమ్యునోగ్లోబ్యులిన్‌ టీకా ఇవ్వాల్సి ఉంటుంది. కుక్కకు ఎలాంటి టీకాలు ఇప్పించకపోయినా, అది వీధికుక్క అయినా, పెంపుడు కుక్క అయినా రేబీస్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. సాధారణంగా చాలామంది వీధిలో రోజూ కనిపించే కుక్క, దానికేం కాలేదు కాబట్టి మాక్కూడా ఏం జరగదు అని చికిత్సను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ అది ఎలాంటి కుక్క అయినా, ఎలాంటి లక్షణాలు లేకున్నా కరచిన వెంటనే తప్పనిసరిగా వైద్యులను కలిసి ఇంజెక్షన్లు తీసుకోవాలి. పెంపుడు కుక్కల నుంచి కుటుంబ సభ్యులకు వ్యాధులు సోకుతాయి కాబట్టి వాటికి తప్పనిసరిగా యాంటీ రేబీస్‌సతో పాటు లెప్టోస్పైరోసిస్‌ లాంటి ఇతరత్రా వ్యాధుల టీకాలు వేయించాలి.

డోసులు ఇలా..

పెంపుడు కుక్క : యాంటీ రేబీస్‌ టీకాలు ఇప్పించిన పెంపుడు కుక్క కరిచినప్పుడు మూడు డోసుల యాంటీ రేబీస్‌ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కుక్క కరిచిన రోజు, ఏడవ రోజు 21 రోజు ఈ ఇంజెక్షన్లు తీసుకోవాలి.

వీధి కుక్క : ఈ కుక్క కరిచినప్పుడు ఐదు డోసుల యాంటీ రేబీస్‌ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కుక్క కరిచిన రోజు, మూడో రోజు, ఏడవ రోజు, 14వ రోజు, 27వ రోజు ఈ ఇంజెక్షన్లు తీసుకోవాలి. 90వ రోజున బూస్టర్‌ డోసు తీసుకోవాలి.

నేడు రేబిస్‌ వ్యాధి నివారణ దినం

కుక్క కరిచిన వెంటనే ఆ భాగంలో కుళాయి నీటితో పది నిమిషాలపాటు శుభ్రంగా కడగాలి. ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి టీకాలు వేయించుకోవాలి. వైద్యులు లేకుంటే మెడికల్‌ స్టోర్స్‌లో లభించే అయోడిన్‌, సేవ్‌లాన్‌ వంటి యాంటిసెప్టిక్‌ లోషన్లు రాయాలి. గాయం అయితే వైద్యుడిని సంప్రదించి రేబిస్‌ ఇమ్యూనోగ్లోబులిన్‌ టీకా వేయించుకోవాలి. బయట ఇంజెక్షన్‌ కొనాలంటే రూ.3వేలు అవుతుందని, ప్రభుత్వఆస్పత్రిలో ఉచితంగా వేస్తారు.

– డాక్టర్‌ రాంబాబు, పశు వైద్యాధికారి, వెటర్నరీ పాలిక్లీనిక్‌, కడప

తక్షణ చికిత్సతోనే ప్రాణాలకు రక్షణ 1
1/1

తక్షణ చికిత్సతోనే ప్రాణాలకు రక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement