
అంగన్‌వాడీ.. అధోగతి
● అంగన్వాడీ కేంద్రాల పట్ల కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం
● 2022 ఫిబ్రవరి ధరలకు అనుగుణంగానే నేటికీ బిల్లుల చెల్లింపు
● అప్పటి నుంచి మూడురెట్లు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు
● కేంద్రాల నిర్వహణకష్టసాధ్యమంటున్న కార్యకర్తలు
● కేంద్రాల నిర్వీర్యం దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులు
కడప కోటిరెడ్డిసర్కిల్: కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రాలకు వచ్చే చిన్నారులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భవతులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి. అయితే ప్రస్తుత ధరలకు అనుగుణంగా బిల్లులు పెంచుతామని ప్రభుత్వం చెబుతున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ పెంచకపోవడం బాధాకరం. ఈ క్రమంలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, ఖర్చులు భారీగా పెరగడంతో కార్యకర్తలకు భారంగా మారింది. అసలే వారి జీతాలు అంతంత మాత్రంగా ఉంటే, దీనికితోడు పాత ధరల ఆధారంగా బిల్లులు చెల్లిస్తుండడంతో వంట ఖర్చులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
● అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన ప్రీ స్కూలు పిల్లల ఆహారం కోసం కూరగాయలు, ఆకుకూరలు, పసుపు, చింతపండు, కారంపొడి తదితర సామాగ్రి ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి. అయితే వీటి కొనుగోలుకు ఒక చిన్నారికి నెలకు రూ. 50 ప్రభుత్వం చెల్లిస్తోందని చెబుతున్నారు. అయితే ఇది ఏమాత్రం సరిపోవడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. రోజుకు ఒకరికి కూరగాయలు, పోపులకు రూ.1.50, గ్యాస్ నెలకు రూ. 450 చొప్పున ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 950లకు కొనుగోలు చేస్తున్నామని, పెరిగిన ధరల కారణంగా మెను ప్రకారం వండి పెట్టాలంటే అదనపు భారం తప్పడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెను ప్రకారం బిల్లులు
2022 ఫిబ్రవరి ధరలకు అనుగుణంగా ప్రస్తుతం బిల్లులు చెల్లిస్తున్నారు. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరలు మూడు రెట్లు పెరగడంతోపాటు గ్యాస్ ధర కూడా బిల్లు చెల్లించిన దానికంటే అదనంగా రూ. 500 పెరిగింది. మెనుప్రకారం వండి పెట్టాలంటే తమకు భారంగా ఉందని, ప్రస్తుత ధరల ప్రకారం బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు విన్నవించాం
కొత్త ధరల ప్రకారం బిల్లులు ఇవ్వాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. ఈ విషయంగా ఉన్నతాధికారులకు విన్నవించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాల వచ్చిన వెంటనే కొత్త బిల్లుల చెల్లింపునకు చర్యలు చేపడతాం. – రమాదేవి,
ఐసీడీఎస్ పీడీ, కడప