రూపాయి చారిత్రక పతనం దిశగా దూసుకెళ్తోంది. నానాటికీ తీసికట్టు అన్నట్లు.. బుధవారం 64 రూపాయల స్థాయిలోనే ఉందనుకుంటే, గురువారం నాటికి ఏకంగా 65కు పడిపోయింది. దీంతో డాలర్తో పోలిస్తే ఇప్పటివరకు చరిత్రలోనే ఎన్నడూ లేనంత కనిష్ఠ విలువ నమోదైనట్లయింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజి మార్కెట్లో గురువారం ఉదయం అమెరికన్ డాలర్లకు డిమాండ్ బాగా పెరిగింది. స్థానిక ఈక్విటీ మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉండటంతో బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్ కోసం డిమాండ్ పెరగడంతో రూపాయి మరింత బలహీనపడింది. దీనికితోడు, ఇతర దేశాలకు చెందిన కరెన్సీల విలువ కూడా పడిపోతుండటం కూడా డాలర్ను మరింత బలపరిచింది. అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ తన విధాన నిర్ణయాలను బుధవారం ప్రకటించిన తర్వాత డాలర్ బలం మరింత పెరిగింది. ఆస్తుల కొనుగోలు కార్యక్రమాన్ని మరింత పెంచేందుకు కట్టుబడి ఉన్నట్లు సెంట్రల్ బ్యాంకు ప్రకటించింది. డాలర్ బలపడటానికి ఈ సెంటిమెంటు బాగా పనిచేసిందని డీలర్లు చెబుతున్నారు. కరెంటు ఖాతా లోటు బాగా పెరగడంతో పాటు, స్థానికంగా ఉన్న ఇతర ప్రాథమిక అంశాలు కూడా రూపాయి నీరసించడానికి కారణమయ్యాయని అంటున్నారు. బుధవారం ఉదయం ఒక దశలో 64.54 వరకు వెళ్లిన రూపాయి చివర్లో 64.11 వద్ద ముగిసింది. కానీ గురువారం మాత్రం మళ్లీ 65 స్థాయిని తాకింది. ఉదయం పది గంటల సమయానికి మళ్లీ 64.72 వద్ద ట్రేడవుతోంది. రూపాయి సెంటిమెంటు బీఎస్ఈ సెన్సెక్స్ను మళ్లీ పడేసింది. గురువారం ఉదయం ట్రేడింగ్ మొదలయ్యేసరికే సెన్సెక్స్ 17,829.91కి పడిపోయింది. వరుసగా ఐదో రోజు కూడా సెంటిమెంటు ఏమాత్రం బాగోకపోవడంతో నష్టాలతోనే ప్రారంభమైంది. 76 పాయింట్లు నష్టపోతూ మార్కెట్ మొదలైంది. ప్రధానంగా రియాల్టీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల షేర్లు పడిపోయాయి. గడచిన నాలుగు సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 1,461 పాయింట్లు నష్టపోయింది. అలాగే, ఎన్ఎస్ఈ కూడా 5,300 దిగువకు పడిపోయింది. మొత్తం 14.90 పాయింట్లు నష్టపోయి 5,287.65 వద్ద ప్రారంభమైంది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలించకపోవడంతో సెంటిమెంటు బాగా బలహీనంగానే ఉండబోతోందని బ్రోకర్లు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంకు తన విధాన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఆసియాకు చెందిన షేర్లు బలహీనపడ్డాయి. హాంకాంగ్కు చెందిన హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ 1.28 శాతం పడిపోగా, జపాన్కు చెందిన నైకీ ఇండెక్స్ 0.82 శాతం తగ్గింది. అమెరికా ఫెడరల్ బ్యాంకు నిర్ణయాలే మార్కెట్ను గందరగోళంలోకి నెట్టేశాయని, అది కోలుకోడానికి ఏమాత్రం సమయం చిక్కలేదని హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన అశుతోష్ రైనా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈఎం కరెన్సీలను ఈక్విటీలలో అమ్మేయడం కూడా ఒత్తిడిని పెంచిందని, రూపాయి విలువ మరింత పతనం కావడం తప్పదని ఆయన చెప్పారు.
Published Thu, Aug 22 2013 10:19 AM | Last Updated on Thu, Mar 21 2024 8:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement