నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం రాజ్యా తండా సమీపంలో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. వీరిలో 10 మంది ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఆరుగురు దేవరకొండ ఆస్పత్రిలో మృతి చెందారు. కాగా, 10 మందికి పైగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు...మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన వడ్డెరలు కొందరు హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో కూలీ పనులు చేసుకుంటూ నివాసముంటున్నారు. దేవరకొండ మండలం చెలుగుపల్లిలో చనిపోయిన ఒక వ్యక్తి కర్మకాండలకు వీరంతా హాజరయ్యారు. అనంతరం తుఫాన్ వాహనంలో తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా రాజ్యా తండా వద్ద ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ఇంతలోనే వెనుక నుంచి వస్తున్న లారీకి ఈ వాహనాలు తగలడంతో లారీ బోల్తా పడి అందులోని ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన పది మందికి పైగా వ్యక్తులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులు, క్షతగాత్రుల పూర్తి వివరాలు అందాల్సి ఉంది.