కర్ఫ్యూ నేపథ్యంలో విజయనగరంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు రెండు గంటలు కర్ఫ్యూని సడలించారు. దీంతో మార్కెట్‌లో నిత్యావసరాలు తెచ్చుకునేందుకు జనం పోటీ పడ్డారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ధరలను భారీగా పెంచి అమ్ముతున్నారు. కూరగాయలు, పాలు తగినంతగా దొరకడం లేదని స్థానికులు వాపోయారు. కర్ఫ్యూ ఎత్తివేయాలని కోరుతున్నారు. కనీసం సాయంత్రం నాలుగు గంటల వరకూ అయినా కర్ఫ్యూ సడలిస్తే బాగుంటుదని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ.... పోలీసులు మాత్రం కేవలం కర్ఫ్యూను రెండు గంటల మాత్రమే సడలించారు. మరోవైపు విజయనగరంలోని ఆర్అండ్బీ రైతు బజార్ ఎస్టేట్ అధికారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో రైతులపై దౌర్జన్యం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ పోలీసు చేయి చేసుకోవటం దురదృష్టకరమన్నారు. అవగాహన లేకపోవటం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అధిక ధరలకు నిత్యావసర వస్తువులు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాపారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. కాగా పోలీసుల దురుసు ప్రవర్తనను నిరసిస్తూ రేపటి నుంచి విధులకు హాజరు అయ్యేది లేదని రైతు బజారు అధికారులు స్పష్టం చేశారు.
Published Wed, Oct 9 2013 9:32 AM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement