తాలిబన్ల కాల్పుల్లో గాయపడి కోలుకున్న పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్ 16వ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఐక్యరాజ్యసమితిలో ‘మలాలా డే’ పేరుతో నిర్వహించిన వేడుకల్లో ఏడుగురు యువతులకు ప్రత్యేక అవార్డులు లభించాయి. వీరిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. బెంగళూరుకు చెందిన అశ్వనీ(21), ఉత్తరప్రదేశ్‌కు చెందిన రజియా(15)లను ‘ఐరాస ప్రత్యేక దూత-ప్రపంచ విద్య యువసాహస అవార్డు’లతో సత్కరించారు. బాలికల విద్య, మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తున్నందుకు వీటిని ప్రదానం చేశారు. మిగతా అవార్డుగ్రహీతల్లో మాలాలాపై తాలిబన్లు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఆమె సహ విద్యార్థిని షాజియా(15), బంగ్లాదేశ్‌కు చెందిన కేశోబ్(18), నేపాల్ యువతి ఊర్మిళ(22), మొరాకోకు చెందిన రూయియా(12), సియెర్రా లియోన్ యువతి అమినాతా(20) ఉన్నారు. ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి.. కర్ణాటకలోని పేద గ్రామీణ కుటుంబంలో దృష్టిలోపంతో జన్మించిన అశ్వనీ చదువుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. డిగ్రీ పూర్తయ్యాక ఓ ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించారు. అయితే వికలాంగ బాలలకు విద్యా సౌకర్యాల కోసం ఉద్యమించేందుకు ఉద్యోగాన్ని వదిలేశారు. ప్రస్తుతం లియోనార్డ్ చెషైర్ డిజేబిలిటీ అనే ఎన్జీఓలో పనిచేస్తున్నారు. బాల కార్మికుల కోసం.. గతంలో బాల కార్మికురాలిగా పనిచేసిన రజియా చదువుకోవడానికి ఎన్నో కష్టాలు పడింది. ఫుట్‌బాళ్ల తయారీ పరిశ్రమలో పనిచేసింది. 11వ తరగతి పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం బాలకార్మికుల విముక్తి కోసం, వారి చదువు కోసం శ్రమిస్తోంది. రజియా గత ఏడాది 48 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించింది.
Published Sun, Jul 14 2013 3:50 PM | Last Updated on Thu, Mar 21 2024 9:14 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement