నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ఇప్పటికే లెక్కలేనన్ని విన్యాసాలు చేసి, జనానికి రంగుల చిత్రాలు చూపి ఇన్నాళ్లూ ఏమార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదిలో సరికొత్త ఆలోచన పురుడు పోసుకుంది. దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ‘బాహుబలి’లోని మాహిష్మతి రాజ్యం సెట్టింగ్ ముఖ్యమంత్రికి విపరీతంగా నచ్చేసిందట! అందులోని సుందర కట్టడాలు, ఎత్తయిన శిల్పాలు, హంసలు విహరించే సరస్సులు ఆయన మనసు దోచేశాయట! ఇంకేముంది అమరావతిలో కూడా మాహిష్మతి సెట్టింగ్‌ల్లాంటి భవనాలే ఉండాలని ఇటీవల సీఆర్‌డీఏ అధికారుల సమావేశంలో సూచనలిచ్చేశారు.