ఎప్పుడూ తన వ్యతిరేకుల విషయంలో ఫైర్‌బ్రాండ్ కామెంట్లు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిగొచ్చారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు, తనకు అత్యంత సన్నిహితుడు అయిన కుమార్ విశ్వాస్‌ను వదులుకోడానికి ఏమాత్రం ఇష్టపడక.. ఆయన పెట్టిన షరతులకు తలొగ్గారు. గత కొన్ని రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించడానికి ఇంతకాలం తనకు ఏ మాత్రం అలవాటు లేని రాజీ ధోరణిలోకి వచ్చారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాల మీద బహిరంగంగా ధ్వజమెత్తిన కుమార్ విశ్వాస్.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లతో కలిసిపోయారని, అందుకే అలా మాట్లాడుతున్నారని పీఏసీ సభ్యుడు అమానతుల్లా ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. తనతో పాటు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలను ఆయన బీజేపీలోకి తీసుకెళ్లిపోతున్నారని, అందుకు ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల చొప్పున ముట్టజెబుతున్నారని కూడా ఆయన అన్నారు. దీంతో ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీలో కలకలం రేగింది. అమానతుల్లాఖాన్ ఆరోపణలను ఖండించిన కుమార్ విశ్వాస్.. ఆయన ముసుగులో ఎవరు మాట్లాడుతున్నారో కూడా తనకు తెలుసని వ్యాఖ్యానించారు. పరోక్షంగా పార్టీ అగ్ర నాయకత్వం మీద ఆయన విమర్శలు గుప్పించారు.