ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో భగ్గుమన్న అంతర్గత అసమ్మతి అధికార ఆమ్ ఆద్మీ పార్టీని కుదిపేస్తూనే ఉంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంపై అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అసమ్మతి తీరంలో చేరిన ఆప్ కీలక నేత కుమార్ విశ్వాస్ సైతం ఇక కేజ్రీవాల్‌కు రాంరాం చెప్పాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కుమార్ విశ్వాస్ బీజేపీ ఏజెంట్ అని, ఆప్‌లో చీలిక తెచ్చేందుకు అతన్ని బీజేపీ, ఆరెస్సెస్ వాడుకుంటున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ బాహాటంగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ విమర్శలు ఖండించకపోగా.. ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దంటూ సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు.