ఉల్లి ధరలు పెరగటానికి దిగుబడి తగ్గటం... ఎగుమతులు పెరగటం... అక్రమ నిల్వలుంచటం వంటివి అసలు కారణాలు కాదు. రైతు నుంచి సరుకును వినియోగదారుకు చేర్చడానికి మధ్య ఉన్న దళారీ వ్యవస్థే అసలు కారణం. ఇరువురి మధ్యా వారధిలా ఉండాల్సిన వ్యవస్థ... ఇరువురినీ శాసించే స్థాయికి చేరటమే అసలు సమస్య. ఉల్లి ధర పెరుగుదలకు దిగుబడి తగ్గటమే కారణమా? అబద్ధం. ఎందుకంటే ఈ ఏడాది దేశవ్యాప్తంగా అంచనా వేసిన పంట దిగుబడి 16.5 మిలియన్ టన్నులు. దిగుబడి కూడా అంచనాకు తగ్గట్టే 16 నుంచి 17 మిలియన్ టన్నుల మధ్య వస్తోంది. అంటే దిగుబడి తగ్గిందన్న ప్రసక్తే లేదు. ఒకవేళ నాలుగైదు శాతం దిగుబడి తగ్గినా దానికి ధరల్ని 300 నుంచి 400 శాతం పెంచేంత శక్తి ఉందనుకోలేం. ఇక ఎగుమతులు పెరగటం వల్లేనన్న వాదనను తీసుకుంటే... అది కూడా అబద్ధమని తేలుతుంది. ఎందుకంటే ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య మన దేశం నుంచి ఎగుమతయిన మొత్తం ఉల్లి 7 లక్షల టన్నులు. గతేడాది ఈ కాలంలో జరిగిన ఎగుమతి 8.5 లక్షల టన్నులు. మరి అప్పటికన్నా తక్కువ ఎగుమతి జరిగినపుడు అప్పటికన్నా రేటు ఇంతలా ఎలా పెరిగింది? పెపైచ్చు జూలైలో 1.5 లక్షల టన్నులు ఎగుమతి కాగా... ధరలు ఆకాశానికెగసిన ఆగస్టులో జరిగిన ఎగుమతులు కేవలం 30 వేల టన్నులు. అయినా దేశీయంగా ఇంత ధరొస్తున్నపుడు ఎవరైనా ఎగుమతులెందుకు చేస్తారు చెప్పండి!! పోనీ ఈ రెండూకాక అక్రమ నిల్వల వల్లే ధరలు ఈ స్థాయికి చేరాయన్న వాదనను పరిశీలించినా... అదీ అబద్ధమని తేలిపోతుంది. ఎందుకంటే ఉల్లి సీజనల్ ఉత్పత్తి. దాన్ని అన్‌సీజన్‌లో నిల్వ ఉంచక తప్పదు. అలా నిల్వ ఉంచడానికి ప్రభుత్వ ఏజెన్సీలే సహకరిస్తుంటాయి. పెపైచ్చు మార్కెట్లో ధర ఈ స్థాయికి చేరినపుడు ఏ వ్యాపారైనా బయట విక్రయిస్తాడు తప్ప దాచుకోడు. ఇవన్నీ చూశాక... రైతుల వాదన విన్నాక అనిపించేదొక్కటే. రైతులకు, వినియోగదారులకు మధ్య ఏర్పాటయిన బలమైన దళారీ వ్యవస్థకే అధిక డబ్బులు పోతున్నాయని. అది రైతుల మాటల్లోనే విందాం... ధర 80 దాటినా రైతుకు దక్కింది రూ. 22!! ఆగస్టులో రాష్ట్రంలో ఉల్లి ధర కిలో రూ.80 దాటేసింది. అప్పుడు కర్నూలులో ఉల్లి పండించిన రైతుకు... అత్యుత్తమ రకానికి కిలోకు రూ.25 దక్కింది. మామూలు రకాలకైతే కిలోకు రూ.20 నుంచి 22 వరకూ దక్కింది. దీనిపై కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన రైతు అయ్యప్పతో మాట్లాడితే ‘‘మార్కెట్లో ధర ఎంతున్నా మాకొచ్చేది తక్కువే. ఒకోసారి మార్కెట్లో ఎంత ధర ఉందో కూడా మాకు తెలియదు. తెలిసే అవకాశం కూడా ఉండదు. ఇప్పటికీ మాకు ఉల్లి పంట గిట్టడమే లేదు. ఎందుకంటే ఎకరాకు రూ.40 వేల వరకూ ఖర్చవుతోంది. దిగుబడి తగ్గి 70 క్వింటాళ్లకు మించటం లేదు. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావటమే లేదు. కిలోకు రూ.15 మించితేనే మాకు గిడుతుంది’’ అనే సమాధానం వచ్చింది. రాష్ట్రంలో మళ్లీ ఉల్లి ధరలు ఘాటెక్కుతున్నాయి. కిలో రూ.60 దాటేస్తోంది. ఏ కారణం వల్లో కానీ ఇపుడు కర్నూలు రైతుకు దాదాపు సగం ధర వస్తోంది. దీనిపై అదే జిల్లా సి.బెల్గల్ గ్రామానికి చెందిన రైతు మద్దిలేటి మాట్లాడుతూ ‘‘మాకు నాణ్యమైన పంట వచ్చింది. పంట తక్కువగా ఉండటం వల్లో ఏమో కానీ ఇపుడు మాకు క్వింటాలుకు రూ. 3200 వరకూ వస్తోంది. (కిలోకు రూ.32) అయితే దళారుల చేతికి క్వింటాలుకు రూ.500 వరకూ పోతోంది. అలా పోకుండా ఉంటే మాకు మంచి లాభసాటిగా ఉండేది’’ అని చెప్పాడు. రాష్ట్రంలో అతిపెద్ద ఉల్లిమార్కెట్ అయిన తాడేపల్లిగూడెంలో ప్రస్తుతం రైతుకు ఒక్కో కేజీకి రూ.32 చొప్పున లభిస్తుండగా.. వ్యాపారులు హోల్‌సేల్‌గా రూ.55-60కి విక్రయిస్తుండటం గమనార్హం. మొత్తమ్మీద ఎలా చూసుకున్నా... రైతు నుంచి మార్కెట్ కొచ్చేసరికి ఉల్లి రెండు నుంచి నాలుగింతలు ఘాటెక్కుతోంది. ఎందుకిలా? తెచ్చేది, కొనేది వారే... వ్యవసాయ మార్కెట్లలో క్రయ విక్రయాలు బహిరంగ వేలం ద్వారానే సాగుతాయి. లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయనేది వ్యాపారుల మాట. నిజమే! కానీ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చేవారంతా రైతులేనా? రైతులేమో చేల దగ్గరే సరుకును విక్రయిస్తున్నామంటున్నారు. మరి మార్కెట్‌కు తెచ్చేదెవరు? వ్యాపారులేగా! సరుకు తెచ్చేవారు, కొనేవారు కుమ్మక్కయి... అంతా కలిసి ఒకే ధర నిర్ణయిస్తే అటు రైతులకు గానీ ఇటు వినియోగదారులకు గానీ దిక్కెవరు? రైతు దగ్గర కిలో రూ.10కి కొన్న వ్యాపారి, అవే ఉల్లిగడ్డల్ని వ ్యవసాయ మార్కెట్లో రూ.40కి విక్రయిస్తే... వాటిని కొన్న వ్యాపారి రూ.42కు హోల్‌సేలర్‌కు అమ్మితే... అక్కడి నుంచి రిటైలర్‌కు.. తర్వాత వినియోగదారుకు వచ్చేసరికి ధర రూ.50-60కి చేరితే దాన్ని ఛేదించాల్సింది ప్రభుత్వం కాదా? ప్రతిసారీ ఉల్లిపాయలు జాతీయ స్థాయిలో హాట్‌టాపిక్‌గా మారడానికి ఈ సరఫరా లింకేజీ లోపాలే అసలు కారణం కాదా? ఇదీ... రైతు దుస్థితి రైతుల మాటల్లో చెప్పాలంటే వారు నేరుగా తెచ్చి విక్రయించలేరు. అది సాధ్యం కాదు. కారణమేంటంటే స్థానికంగా ఉండే దళారి. గౌరవంగా చెప్పాలంటే ఖరీదుదారు. దళారిని కాదని మార్కెట్లో విక్రయించే పరిస్థితి రైతుకుండదు. ఎందుకంటే తను ఆ రైతుకు ముందే రుణమిస్తాడు. ఇలా రుణాలివ్వటానికి దళారులు ఎప్పుడూ ముందే ఉంటారు. బ్యాంకుల నుంచి రుణం రావటమంటే మాటలు కాదు కనక రైతులెప్పుడూ దళారులనే ఆశ్రయిస్తారు. అవసరాన్ని బట్టి ఈ రుణాలకు నెలకు 4 శాతం వడ్డీ చెల్లించే రైతులూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో సాగు ప్రారంభానికి ముందే రైతు, దళారి మధ్య ‘ఒప్పందం’ జరుగుతోంది. పంట చేతికి రాగానే సదరు దళారికి సరుకు పూర్తిగా అప్పగించాలి. దళారి మొదట నిర్ణయించిన ధరకు మించి ఒక్కపైసా రైతుకివ్వడు. ‘‘అవసరమైనప్పుడు సాయం చేస్తారు కాబట్టి వారి మాట వింటాం. వారు చెప్పిన ధరకు సరుకు విక్రయిస్తాం. రూ.6 వేలు అప్పు ఇచ్చిన దళారి కూడా మాకు గొప్పే’’ అని ఓ రైతు చెప్పాడు. ఒకవేళ రేటు గిట్టుబాటు కాదని బతిమాలితే... పంట నాణ్యత సరిగా లేదు. ఇంత కన్నా ఎక్కువ ధర రాదనే సమాధానం ఎదురవుతుంది. పంటను నిల్వ చేసే తాహతు రైతుకుండదు.అందుకే రైతుకు దక్కిందే బంగారం మరి.
Published Wed, Oct 23 2013 7:08 AM | Last Updated on Wed, Mar 20 2024 2:08 PM
Advertisement
Advertisement
Advertisement