తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్కు కండలవీరులు కాపు కాయనున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కండల వీరులను రక్షణగా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆశ్చర్యపడకండి. గాంధీభవన్కు బౌన్సర్లతో భద్రత కల్పించాలని హస్తం పార్టీ నిర్ణయించింది. అసలే ఎన్నికల కాలం కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి పోటెత్తున్నారు. టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహులు పెద్ద నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి గాంధీభవన్ మెట్లు ఎక్కుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కిటకిటలాడుతోంది. ఇక టిక్కెట్ దక్కని కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీ పెద్దలపై కారాలు మిరియాలు నూరుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి టిక్కెట్లు ఇవ్వరా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. కొంత మంది దూషణలతో ఆగకుండా పార్టీ కార్యాలయంపై ప్రతాపం చూపుతున్నారు. ఈ పరిణామాలన్ని గమనించిన కాంగ్రెస్ పెద్దలు తమ పార్టీ కార్యాలయానికి కండల వీరులను కాపుగా పెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటివరకు పబ్లకు, ప్రైవేటు కార్యక్రమాలకు బౌన్సర్లను భద్రతగా పెట్టుకుంటున్నారు. ఎన్నికల పుణ్యమా అని బౌన్సర్లకు సరికొత్త గిరాకీ తగిలింది. ఇక గాంధీభవన్లో గళం వినిపించాలనుకునే కాంగ్రెస్ నాయకులు కాస్త వెనుకాముందు చూసుకోవడం మంచిది.