రాష్ట్రంలో ఎక్కడైనా అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు, లేఅవుట్లను నిర్మిస్తున్నట్లు ఉప్పందించిన సామాన్య ప్రజలకు నజరానా అందనుంది. అక్రమ కట్టడాలపై సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన చేస్తోంది. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని మిగిలిన 67 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సి పాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ కొత్త పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టనుంది. అక్రమ కట్టడాలు, లే అవుట్ల గురించి ఉప్పందించిన వ్యక్తుల సమాచారం నిజమేనని తేలితే వారికి రూ.5 వేలు లేదా రూ.10 వేలను రివార్డుగా అందించాలని ఆలోచన చేస్తోంది. జీహెచ్ ఎంసీ ప్రతిపాదించిన ఈ వినూత్న కార్య క్రమానికి తాజాగా రాష్ట్ర పురపాలక మంత్రి కె.తారకరామారావు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తూ ఒకట్రెండు రోజుల్లో పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. అనుమతులు లేకుండానే నిర్మాణాలను జరుపుతుం డడంతో మున్సిపా లిటీలు ఆదాయాన్ని నష్టపోతున్నాయి. ఈ కొత్త పథకాన్ని అమలు చేయడం ద్వారా మున్సిపాలిటీలకు ఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.