ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తినలో పర్యటిస్తుంటే.. మరోవైపు ఆయన బావమరిది, హిందుపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం సచివాలయానికి వచ్చారు. పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఛాంబర్కు ఆయన వెళ్లారు. అక్కడ అనంతపురం జిల్లా టీడీపీ నేతలతో పాటు, పలువురు మంత్రులతో బాలకృష్ణ సమావేశం అయ్యారు. బాలకృష్ణ తొలిసారి సచివాలయానికి రావటం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకే భేటీ అయినట్లు మంత్రులు చెప్పటం గమనార్హం. తమ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని టీడీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. అయితే ఈ భేటీకి మీడియాను కూడా అనుమతించలేదు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ నీతి నిజాయితీలకు మారుపేరు తెలుగు దేశం పార్టీ అని, ఇదంతా రాజకీయ కుతంత్రం అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయటం పద్ధతి కాదని, దాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే తాము సమావేశమై చర్చలు జరిపినట్లు బాలకృష్ణ తెలిపారు. కాగా ఓటుకు నోటు వ్యవహారంలో పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విషయంలో స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఈ సమావేశంలో మంత్రులు రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాథరెడ్డి, కింజెరపు అచ్చెన్నాయుడు, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
Published Wed, Jun 10 2015 7:16 PM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement