టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాతతరం మనిషని, తాను యువకుడిని, ఈ తరం ప్రతినిధినని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సగర్వంగా చెప్పుకున్నారు. ఏఎస్ఆర్ గ్రౌండ్‌లో 'వైఎస్ఆర్ జనభేరి' బహిరంగ సభలో భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. చంద్రబాబు కన్నా తాము బాగా పాలించగలం అని చెప్పారు. అధికారంలోకి రాగానే చరిత్రను మార్చే 4 సంతకాలు చేస్తానన్నారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లిబిడ్డల జీవితాల్లో వెలుగు తెచ్చేలా తొలి సంతకం చేస్తాను. అవ్వా, తాతల జీవితాలకు ఊరటనిచ్చేలా వారికి పెన్షన్ రూ.700 పెంచేలా రెండో సంతకం చేస్తాను. రైతన్న ఇంట వెలుగు నిండేలా అన్నదాతకు గిట్టుబాటు ధర కల్పించేందుకు స్థిరీకరణ నిధి కోసం మూడో సంతకం చేస్తాను.అక్కా, చెల్లెళ్ల కళ్లల్లో సంతోషం కోసం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాలుగో సంతకం చేస్తానని చెప్పారు. రాష్ట్రం కోసం జీవితాంతం పాకులాడుతానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ చనిపోయి ఐదేళ్లైనా ప్రజల గుండెల్లోనే ఉన్నారు. విలువలు, విశ్వసనీయత అంటే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్. విశ్వసనీయతకు అర్థం చెప్పిన వ్యక్తి వైఎస్ఆర్. భూతద్దంపెట్టి వెతికినా నేటి రాజకీయ నేతల్లో విలువలు, విశ్వసనీయత కనిపించడం లేదు. చంద్రబాబు ఏనాడైనా విద్యార్థుల వద్దకు వెళ్లారా? చదువుకోవడంలో ఉన్న కష్టనష్టాలు చంద్రబాబుకు తెలుసా? చంద్రబాబు హయాంలో అనారోగ్యం పాలైనవారి కష్టాలు నాకు ఇంకా గుర్తున్నాయి. ప్రాణం బతికించుకునేందుకు, ఆస్పత్రుల ఫీజుల కోసం ఇళ్లు తాకట్టుపెట్టిన రోజులు గుర్తున్నాయి. నిరుపేదల బియ్యాన్ని రూ.2 నుంచి రూ.5 లకు పెంచిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. మద్య నిషేధం ఎత్తేయించాలని ఈనాడులో పెద్దపెద్ద రాతలు రాయించారు. ఈనాడు రాసిన 2,3 రోజులకు బాబు మద్యపాన నిషేధం ఎత్తేశారు. గ్రామగ్రామాన చంద్రబాబు బెల్ట్ షాపులను ఏర్పాటు చేసిన రోజులు గుర్తున్నాయి. ఎఫ్డిఐలకు అనుకూలంగా తన ఎంపీలతో బాబు ఓటేయించారు. తెలుగువారిని మోసం చేసి రాష్ట్రాన్ని విడగొట్టింది చంద్రబాబు. ఇప్పుడు సింగపూర్లాగా మారుస్తానంటున్నారు. రాష్ట్రాన్ని విడదీస్తున్నప్పుడు బాధపడటం తప్ప ఏం చేయలేకపోయాను. కేంద్రంలో కాంగ్రెస్- బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ - చంద్రబాబు కలిసిపోయి రాష్ట్రాన్ని విడదీశారు. 30 ఎంపి స్థానాలు గెలుచుకుందాం, మన ప్రయోజనాలు కాపాడేవారిని ప్రధానిని చేద్దాం అని జగన్ చెప్పారు. వైఎస్ఆర్ జనభేరి భారీగా జనం తరలి వచ్చారు. సభా ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది.
Published Mon, Mar 3 2014 7:04 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement