జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో నగరంలో పరిస్థితి దారుణంగా తయారైంది. మురిగిన చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసన తట్టుకోలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు పొంగుతున్న డ్రైనేజీలు.. కురిసిన కొద్దిపాటి చినుకులతో పరిస్థితి మరింత తీవ్రమైంది. బహిరంగ ప్రదేశాల్లోనే చెత్తను తగులబెడుతుండటంతో కాలుష్యంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సోమవారం నుంచి సమ్మెను ఉద్ధృతం చేయనున్నట్లు కార్మిక సంఘాలు హెచ్చరించాయి.