ఫైలిన్ తుఫాను కాస్తా తీవ్ర పెను తుఫాను అని భారత వాతావరణ శాఖ నిర్ధారించింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి సుమారు 530 కిలోమీటర్ల దూరంలో.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల మధ్య కళింగపట్నం- పారాదీప్ ప్రాంతాల నడుమ రేపు సాయంత్రానికల్లా తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ఫైలిన్ వేగం గంటకు సుమారు 205-215 కిలోమీటర్లుగా ఉంటుంది. ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే అత్యంత భారీ వర్షపాతం కురుస్తుంది. రాబోయే పన్నెండు గంటల్లో ఉత్తర కోస్తాలో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తీరం దాటే సమయంలో గాలుల వేగం 210-220 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో అలలు మూడు మీటర్ల పైబడి ఎత్తుకు ఎగసే అవకాశం ఉంది. తీరప్రాంతంలోని ఇళ్లకు తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యుత్తు, కమ్యూనికేషన్ల వ్యవస్థకు భారీ నష్టం కలగొచ్చు. రోడ్డు, రైలు మార్గాలకు కూడా తీవ్ర ఆటంకం వాటిల్లే అవకాశం ఉంది. పంటలు తీవ్రంగా నష్టపోవచ్చు.