పైలిన్ తుపాను వల్ల ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. తుపానుతో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. తుపాను తీవ్ర ప్రభావం చూపు అవకాశం ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 64వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అధికారులు ఇచ్చే సూచనలను పాటించి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఫైలిన్ తుపాను సూపర్ సైక్లోన్గా మారే అవకాశం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుపాను తూర్పు ఆగ్నేయ దిశగా ప్రయణించి శనివారం నాటికి ఒడిశా-కళింగపట్నం-గోపాలపూర్ ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వివరించారు. అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతున్న కారణంగా రానున్న 12 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా అంతటా భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 1077 టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటూ 08922-236947 అందుబాటులోకి తెచ్చారు. అలాగే విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో 0822-276888, పార్వతీపురంలో 08963-221006 నంబర్లను అందుబాటులోకి తెచ్చారు.
Published Fri, Oct 11 2013 1:30 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM