హస్తినలో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు | Delhi heat up with andhra pradesh politics again | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 23 2013 10:36 AM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

ఢిల్లీకి రాష్ట్ర నేతల తాకిడి మళ్లీ మొదలైంది. ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నాయకులు, మంత్రులు హస్తినబాట పట్టారు. తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని తెలంగాణ ప్రాంత నేతలు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ప్రాంత నేతలు క్యూ కడుతున్నారు. కాగాతెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలంటూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇతర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేయడానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, డి ప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క తదితరులు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. సోమవారం ఉదయం పలువురు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హస్తిన బాట పట్టారు. సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనను తగ్గించేందుకు హైదరాబాద్‌పై ఒక స్పష్టమైన హామీని త్వరగా చేయాలని వారు కోరనున్నట్లు తెలిసింది. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.... ఇరు ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కాగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసి రాష్ట్రంలోని పరిస్థితులను అధిష్టానం పెద్దలకు వివరించారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చన్న అంశంపై చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి జాతీయ సమగ్రతా మండలి(ఎన్‌ఐసీ) సమావేశంలో పాల్గొనడానికి వెళ్తున్నప్పటికీ.. పనిలో పనిగా ప్రధాని, సోనియాతో పాటు పలువురు కోర్‌కమిటీ సభ్యులు, కేంద్ర మంత్రులతో భేటీ అవుతారని సమాచారం. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి చేస్తున్న ఉద్యమాన్ని వివరించడమేకాక, హైదరాబాద్‌కు సంబంధించి అంశంపై ఆయన చర్చిస్తారని తెలుస్తోంది. సీమాంధ్ర మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, టీజీ వెంకటేశ్, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డిలు కూడా ఢిల్లీ వెళ్లారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement