రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన కార్యాచరణను ఉధృతం చేసింది. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, సీపీఎం పార్టీ నేత ఏచూరి సీతారాంతో కలిసి బుధవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాల్సి పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ప్రణబ్ ముఖర్జీకి విజయమ్మ విజ్క్షప్తి చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత సీమాంధ్ర ప్రాంతలో నెలకొన్న పరిస్థితులను, విద్యుత్ ఉద్యోగుల సమ్మె, ఇతర ఉద్యోగ సంఘాల సమ్మెను ప్రణబ్ దృష్టికి వైఎస్ విజయమ్మ తీసుకువచ్చారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటి తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరాను అని తెలిపారు. తన విజ్ఞప్తికి స్పందించిన రాష్ట్రపతి రాజ్యాంగ ప్రకారం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారని విజయమ్మ మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర విభజన అంశంపై తెలంగాణ బిల్లును అసెంబ్లీ తీర్మానం కోసం పంపిస్తామని ప్రణబ్ చెప్పిన విషయాన్ని మీడియాకు తెలిపారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష గురించి అడిగి తెల్సుకున్నారని... ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రణబ్ సూచించారని.. వైఎస్ జగన్ కు షరతులతో కూడిన బెయిల్ ను ఇవ్వడం వల్లనే ఢిల్లీకి రాలేకపోయారని తాను తెలిపానని వైఎస్ విజయమ్మ మీడియాతో అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు అని అన్నారు. తీర్మానాల ద్వారానే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది అని.. అసెంబ్లీ తీర్మానం చేయడం ద్వారానే వివిధ రాష్ట్రాల ఏర్పాటు జరిగిందని విజయమ్మ అన్నారు. రాష్ట్ర విభజన కోసం తెలుగుదేశం పార్టీ లేఖలు ఇచ్చిందనే విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎందుకు దీక్ష చేస్తున్నారో తెలుపాల్సిన అవసరం ఉంది విజయమ్మ డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే.. అందరికి ఆమోదయోగ్యకరమైన రీతిలో నిర్ణయం తీసుకోవాలని గతంలో తాము సూచించామని.. అయితే ఇరుప్రాంతాలకు న్యాయం చేయకుండా.. ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నారని.. 60 శాతం మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
Published Wed, Oct 9 2013 2:36 PM | Last Updated on Wed, Mar 20 2024 3:39 PM
Advertisement
Advertisement
Advertisement