ప్రధాన రహదారుల నుంచి వీధుల చివరిదాకా ఎక్కడ చూసినా చెత్త.. పూడికతో మూసుకుపోయిన డ్రైనేజీలు.. రోడ్లపైనే పారుతున్న మురికినీరు.. ముక్కుపుటాలు అదిరేలా దుర్గంధం, విష వాయువులు.. రాష్ట్రవ్యాప్తంగా పురపాలక సంస్థల్లో పరిస్థితి ఇది. కుళ్లిపోతున్న వ్యర్థాలతో కాలనీలన్నీ కంపు కొడుతున్నాయి. వీధులన్నీ మురికి కూపాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పురపాలక సంస్థల కార్మికుల సమ్మెతో ఏర్పడిన పరిస్థితి ఇది. వేతనాల పెంపు సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం వారు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా.. పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కార్మిక నేతలతో మంత్రులు ఈటల, నాయిని చర్చించినా.. ఎవరూ ఒక మెట్టుకూడా దిగిరాకపోవడంతో ఫలితం శూన్యం. మరోవైపు ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.