సమాజ్వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ములాయం తనదైన శైలిలో కొత్త భాష్యం చెప్పారు. ఒక మహిళను నలుగురు వ్యక్తులు ఎలా రేప్ చేస్తారు, అదంతా బూటకమంటూ వ్యాఖ్యానించారు. కుటుంబంలోని ఓ వ్యక్తి అత్యాచారం చేస్తే దాన్ని మిగిలిన పురుషులకు ఆపాదిస్తున్నారని ములాయం పేర్కొన్నారు. అసలు నలుగురు వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారం చేయడం అసాధ్యమంటూ తన మాటలను మరింత సమర్ధించుకున్నారు. ఇలాంటి కేసులు తాను చాలా చూశాననీ, ఇక ఓ వ్యక్తి అత్యాచారం చేస్తే... అతని సోదరులను కేసులో ఇరుకిస్తున్నారు తప్ప, అసలు గ్యాంగ్ రేప్లు లేవన్నట్టుగా ములాయం చెప్పుకొచ్చారు. యూపీలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, పెరుగుతున్న హింసపై వస్తున్న విమర్శలపై స్పందించిన ఆయన పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే యూపీలో నేరాల సంఖ్య తక్కువని, తక్కువ రేప్‌లు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయి తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని సమర్థించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి నేరంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదంటూ కుమారుడు అఖిలేష్ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చారు. దీంతో ములాయం వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగుతున్నాయి. కాగా మహిళలు, అత్యాచారాలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ములాయంకు కొత్తేమీ కాదు. ఇదే మొదటిసారి అంతకన్నా కాదు.. ఏదో మగపిల్లలు సరదా పడతారు. ..తప్పు చేస్తారంటూ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేప్ చేస్తే ఉరి తీస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ములాయం వ్యాఖ్యలపై పలు మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Published Wed, Aug 19 2015 6:42 PM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM
Advertisement
Advertisement
Advertisement