తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులెవరూ ఈరోజు జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి హాజరు కావొద్దని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత హరీశ్ రావు పిలుపునిచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా.. మంత్రులు ఆయనను ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని టీ-మంత్రులు కిరణ్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత మంత్రులంతా ఏకతాటి మీద నిలబడి, కిరణ్కుమార్ రెడ్డి లాంటి నేతల కుట్రలను అడ్డుకోవాలని కోరారు.