వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మాట్లాడేందుకు నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు గురువారం కూడా స్థానిక క్యాంపు కార్యాలయానికి పోటెత్తారు. ఓ వైపు రాజకీయ భేటీల్లో తీరిక లేకుండా ఉన్న జననేత మరో వైపు తన కోసం వచ్చిన వేలాది మందిని చిరునవ్వుతో పలకరించారు. ఇక నుంచి కార్యకర్తలను నిత్యం కలుసుకుంటానని ఆయన చేసిన ప్రకటన పత్రికల్లో ప్రముఖంగా రావడంతో వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో కార్యాలయానికి చేరుకున్నారు. వీరి రాకతో కార్యాలయ పరిసరాలు నూతన శోభను సంతరించుకున్నాయి. దాదాపు 3 గంటలకు పైగా జననేత వీరందరినీ ఓపిగ్గా పలకరించారు. దీంతో చాలా కాలం తర్వాత జగన్‌ను చూసిన కార్యకర్తలు, నేతలు ఆనందభరితులయ్యా రు. ఇదిలావుంటే, సాధారణ కార్యకర్తలు, నేతలతో పాటు గురువారం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వారిలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, బి. గుర్నాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, మద్దాలి రాజేష్‌కుమార్, ఆళ్లనాని, డీసీ గోవిందరెడ్డి, జలీల్‌ఖాన్, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ తదితరులు ఉన్నారు. ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ భార్య, తన ఇద్దరు పిల్లలతో వచ్చి జననేతను కలిశారు.