కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు వచ్చినట్టు వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల వెనుక కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. పొమ్మనలేక పొగ బెట్టినట్టుగా తనను బయటకు పంపేందుకు కుట్ర జరుగుతుందేమోనని అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆపరేషన్ ఆకర్ష్ తో విపక్షాలను బలహీన పర్చాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తోందని ఆరోపించారు. ఒంటెత్తు పోకడలతో కిరణ్ కుమార్ రెడ్డికి ఏ గతి పట్టిందో చూడాలన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలపై టీఆర్ఎస్ కలలు కంటోందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో అరచేతిలో స్వర్గం చూపించినట్టు ఉందని విమర్శించారు.